సన్న బియ్యం గింజకూడా కొనలే
ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు 200 కోట్లే
అందులో వెయ్యికోట్ల అవినీతి ఎలా సాధ్యం?
సన్నబియ్యం కిలో ౪౨ ఇస్తే ఎంతైనా కొంటం
మిల్లర్లు నిబంధనలు పాటించకుంటే ఊరుకోం
మీరు ౧౭౦౦ ఇస్తే మేం ౨౦౦౭ ఇస్తున్నాం
బీజేపీఎల్పీ పదవి కొనుక్కొన్నది మహేశ్వర్‌రెడ్డే
బీజేపీ, బీఆర్‌ఎస్‌పై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం
రాష్ట్రానికి ౪౯ వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం
కంపెనీలేవీ పోతలేవు
కొత్తవి వస్తున్నాయి
కరెంటు సమస్యలకు బీఆర్‌దే సర్కారుదే బాధ్యత
తప్పుడు ప్రచారం మానుకోండి: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.200 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేస్తే రూ.౧౦౦౦ కోట్ల అవినీతి ఎలా సాధ్యమవుతుందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిలదీశారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు మిల్లర్ల నుంచి సన్నబియ్యం ఒక్క గింజకూడా కొనలేదని తెలిపారు. సన్నబియ్యం కిలో రూ.౪౨కు ఇస్తే ఎంతైనా కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ విపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
తనలాంటి నిజాయితీపరుడిపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. ఆదివారం గాంధీభవన్‌లో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో క్వింటాల్ వరి ధాన్యానికి రూ.1700 ఇస్తే, తాము రూ.2007 ఇస్తున్నామని తెలిపారు. దీంతో రైతులకు రూ.1,100 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. కేంద్రీయ బండార్‌ను బ్లాక్ లిస్టులో పెట్టింది, తీసేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు.
తాలు, తరుగు విషయంలో రైతులకు తమ ప్రభుత్వం లాభం చేకూరుస్తోందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటివరకు సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని అంటున్నారని, కిలో రూ.42కు ఇస్తే ఎంతైనా కొనుగోలు చేస్తామని తెలిపారు. సన్న బియ్యానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని, టెండర్ పెట్టి రద్దు చేశామని మంత్రి వివరించారు.
మిల్లర్ల విషయంలో నిబంధనల మేరకే తమ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టంచేశారు. టెండర్ నిబంధనలకు ఒప్పుకుంటే ఎంత ధాన్యం అమ్మినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. మిల్లర్లపై కఠినంగా ఉన్నది తమ ప్రభుత్వమేనని, తప్పులు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. మిల్లర్లపై గత ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.
మిల్లర్లను కలువను కూడా లేదు
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ‘నేను మిల్లర్ల దగ్గర కమిషన్లు తీసుకోవడమా? ఇప్పటివరకు కనీసం వాళ్లను కలవలేదు. నాలాంటి నిజాయితీపరుడిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బాధ్యతారహిత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు. డిఫాల్టర్ రైస్ మిల్లర్ల కోసమే బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్న వాళ్లే.. మిల్లర్లను ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సివిల్ సప్లయ్ శాఖలో రూ.58 వేల కోట్లు, సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌లో రూ.11 వేల కోట్ల అప్పులు చేసిందని తెలిపారు. గతంలో కంటే ధాన్యం కొనుగోళ్లను తమ ప్రభుత్వం ముందే ప్రారంభించిందని, తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతుధరకు కొనుగోలు చేయాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతుధరకు కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు.
సీఎంతో భూ సెటిల్‌మెంట్లు మాట్లాడినట్లు కాదు
బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను రాష్ట్రంలో ట్యాక్స్‌లు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నట్లు మహేశ్వర్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మహేశ్వర్‌రెడ్డినే ఢిల్లీకి డబ్బులు పంపి బీజేపీఎల్పీ పదవిని కొనుక్కున్నారని విమర్శించారు. ‘ఇటీవల సచివాలయలో సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు వినతిపత్రాలు తీసుకొచ్చి.. లోపల భూముల విషయం మాట్లాడినట్టు కాదు.. మా అలాంటి సంస్కారం లేదు’ అని కౌంటర్ ఇచ్చారు. బీజేపీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అధిగమించేందుకు మహేశ్వర్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
బీజేపీలోకి వెళ్లగానే తప్పులు ఒప్పయినాయా?
బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లగానే వాళ్ల తప్పులు ఒప్పులుగా మారాయా? అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నిలదీశారు. ఎక్కువ మాట్లాడితే పెద్ద లీడర్ కాబోరని, వాస్తవాలు మాట్లాడితేనే పెద్ద లీడర్ అవుతారని చురకలంటించారు. ఏ ప్రభుత్వమైనా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసిందా? సివిల్ సప్లయ్ శాఖ అప్పుల్లోకి వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం కారణం కాదా? మిల్లర్లు చేస్తున్న తప్పులకు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత కరెంట్ కూడా ఇవ్వడం లేదని అన్నారు.
మా పనితీరే సమాధానం
బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసినా ఎంపీ ఎన్నికల్లో సీట్లు రావట్లేదనే అక్కసుతో ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. ప్రతిపక్షాల విమర్శలకు మా పనితీరే సమాధానం అని స్పష్టంచేశారు. గత ప్రభుత్వంలాగా తాము పొరపాట్లు చేయబోమని అన్నారు. గత సంవత్సరం బీఆర్‌ఎస్ పాలనలో వరంగల్ ఎంజీఎం దవాఖానలో 121 సార్లు కరెంట్ పోయిందని, రోగి చర్మాన్ని ఎలుకలు తిన్నాయని గుర్తు చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి రూ.49 వేల కోట్ల పెట్టుబడులు పెడుతామని వివిధ కంపెనీలు వచ్చాయని, మరో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరగుతున్నా యని చెప్పారు. కిమ్స్ పరిశ్రమ ఎక్కడికీ వెళ్లలేదని, కార్నింగ్ సంస్థ మన రాష్ట్రంతో ఒప్పందం చేసుకోలేదని తెలిపారు. పెట్టుబడులు తీసుకొచ్చి యువ తకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాల మంచి విధానాలను తమ ప్రభుత్వం కొనసాగి స్తోందని తెలిపారు. 2016 నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిశ్రమలకు దాదాపు
మా పనితీరే సమాధానం
రూ.3,007 కోట్ల సబ్సిడీలను ఇవ్వలేదని విమర్శించారు. ప్రధాని కార్యాలయం నుంచి రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా తీసుకెళ్లినా.. అంతకంటే ఎక్కువగానే తీసుకొస్తామని అన్నారు. విద్యుత్ పంపిణీలో వచ్చిన చిన్న సమస్యలను పెద్దవి చేస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాది మార్చి 14 వరకు 238 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తే.. ఈ ఏదాడి మార్చి 14 వరకు 309 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఇచ్చామని తెలిపారు. 2018లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక దాదాపు 40 రోజుల వరకు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయలేదని, అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేశామని చెప్పారు.






