సన్నబియ్యంలో వెయ్యి కోట్ల స్కాం
గ్లోబల్ టెండర్లతో అవినీతికి భారీ కుట్ర
కాంగ్రెస్ ఖజానా నింపుతున్న టెండర్ సంస్థలు
కుంభకోణంలో సీఎం నుంచి ఢిల్లీ వరకు పాత్ర
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): ధాన్యం అమ్మకం, సన్నబియ్యం కొనుగోలులో రూ.౧౦౦౦ కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పేరుతో రూ.700 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం కొనుగోలు పేరుతో మరో రూ.300 కోట్ల కుంభకోణం చేశారని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ కుంభకోణం రెండు భాగాలుగా జరిగిందని తెలిపారు. ధాన్యం అమ్మకం కోసం కుట్ర చేశారని, జనవరి 25వ తేదీన కమిటీ వేసి, అదేరోజు మార్గదర్శకాలు విడుదల చేసి టెండర్లు పిలిచారని గుర్తుచేశారు. హామీల అమలులో లేని ఈ వేగం అవినీతి సొమ్ము కోసం మాత్రమే కాంగ్రెస్ పెద్దలు చూపించారని ఆరోపించారు.
గ్లోబల్ టెండర్లతో భారీ కుట్ర
ధాన్యం క్వింటాల్‌కు రూ.2,100 చొప్పన స్థానిక రైస్ మిల్లులు కొంటామన్నా ఇవ్వకుండా అర్హత నిబంధనల్లో మార్పులు చేసి గ్లోబల్ టెండర్ల పేరుతో ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. గ్లోబల్ టెండర్లను కేంద్రీ య భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే సంస్థలు దక్కించుకున్నాయని, ఇందులో కేంద్రీయ బండార్‌ను గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ బ్లాక్ లిస్టులో పెట్టిందని గుర్తుచేశారు. ఇప్పుడు నిబంధనలు సడలించి బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీ టెండర్లలో పాల్గొనేలా చేశారని ఆరోపించారు.
రూ.1,885 నుంచి రూ. 2,007 వరకు కోట్ చేసి సదరు సంస్థలు దక్కించుకున్నాయని, రూ.93 నుంచి రూ.200 తక్కువకు గ్లోబల్ టెండర్లు పిలిచి కట్టబెట్టారని విమర్శించారు. ఈ నాలుగు సంస్థలు ధాన్యం మాత్రమే సేకరించుకొని వెళ్లిపోవాలి కానీ మిల్లర్ల వద్ద డబ్బులు తీసుకుని మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నా యని ఆరోపించారు. ఈ కుంభకోణంలో సీఎం కార్యాలయం, ఢిల్లీ ఏఐసీసీ పెద్దలకు వాటాలున్నాయని విమర్శించారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖజనా నింపేందుకు క్వింటాల్‌కు కనీసం రూ.150 వరకు అదనంగా చెల్లించాలని రైస్ మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
అదనంగా డబ్బులు ఇవ్వకపోతే పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ దాడులు చేయించి కేసులు పెడుతామని రైస్ మిల్లులను బెదిరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో సేకరించిన ధాన్యంలో ౧,౨౦,౦౦౦ టన్నుల సన్న రకాలు ఉంటే వాటిని కిలో రూ.22కు అమ్మివేసిందని తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరి ఈ ధాన్యం రైస్ మిల్లర్లకు ఇచ్చి బియ్యం సేకరిస్తే కేవలం రూ.35కు కిలో నాణ్యమైన సన్నబియ్యం వచ్చేవని తెలిపారు. ధాన్యం తక్కువకు అమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం కిలోకు రూ.15 అదనంగా పెట్టి సన్నబియ్యం కొనుగోలు చేసిందని విమర్శించారు.
ఈ రెండు కుంభకోణాల మొత్తం రూ.1000 కోట్లని, ఈ మొత్తం వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డి పాత్ర కూడా ఉండే అవకాశముందని అనుమానం వ్యక్తంచేశారు. ఆదేశాలు లేకుండా ఏమీ జరగదని అన్నారు. ఈ స్కాంలో కాంగ్రెస్‌తోపాటు బీజేపీ నాయకుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. తెలంగాణలో ఇంతపెద్ద కుంభకోణం జరిగినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందిం చడంలేదని నిలదీశారు. ఎఫ్‌సీఐ, ఈడీ, సీబీఐ, విజిలెన్స్ సంస్థల ద్వారా విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. దోషులను ప్రజల ముందు నిలబెడుతామని, ఆధారాలతో వీరిని కోర్టులతో పాటు ప్రజా కోర్టులో ఎండగడతామని స్పష్టంచేశారు.






