31 March, 2026 | 5:28 PM

24 గంటల సమయం ఇవ్వలేరా?

18-02-2025 01:08 AM
  1. అక్రమ కట్టడాల కూల్చివేతపై హైకోర్ట్ ఫైర్
  2. హైడ్రా ఇన్‌స్పెక్టర్ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలంటూ నిర్మాణదారులకు నోటీసులిచ్చి, కనీసం వారికి 24 గంటల సమయమైన ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. శనివారం నోటీస్ ఇచ్చి ఆదివారం కూల్చివేయడమేంటని హైడ్రా అథారిటీని ప్రశ్నించింది.

ఈ విధానాలు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని అభిప్రాయపడింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రాంతం ముతంగి గ్రామానికి చెందిన ఎ.ప్రవీణ్ అనే వ్యక్తి తాను నిర్మించిన కట్టడం కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కట్టడం కూల్చివేతపై ఈనెల 20న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ సోమవారం హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ఇటీవల విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పార్క్ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన వినతి పత్రాలపై హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా నోటీసులు జారీ చేసిందన్నారు. దీనిపై భూమార్పిడి ప్రొసీడింగ్స్, సేల్ డీడ్, పంచాయతీ అనుమతులు సహా అన్ని వివరాలను సమర్పించినా కూల్చివేత చేపట్టారని కోర్డుకు తెలిపారు.

ఫిర్యాదు చేసిన అసోసియేషన్‌తో పాటు పిటిషనర్‌ను పిలిచి విచారణ చేపట్టకుండా ఏకపక్షంగా కూల్చివేయడం సమం జసం కాదన్నారు. కూల్చివేతలు చేపట్టిన హైడ్రా ఇన్‌స్పెక్టర్ సైతం పోలీస్ కేసు పెట్టారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పత్రాలు సమర్పించేందుకు నిర్మాణదారులకు తగిన గడువు ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

హైడ్రా శనివారం నోటీసులు జారీ చేసి, ఆదివారం కట్టడాలు కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. ముతంగిలో నోటీసులపై వివరణ ఇచ్చాక ఫిర్యాదుదారు, పిటిషనర్లను విచారించకుండా చేపట్టిన కూల్చివేతపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌ను ఆదేశిస్తూ, విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు.

ప్రభుత్వం కేటాయించిన భూముల్లో కట్టడాలు నిర్మించొద్దు!

కమ్మ, వెలమ, కాపు సంఘాలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి ప్రాంతంలో కమ్మ, వెలమ, కాపుతోపాటు ఇతర సంఘాలకు కేటాయించిన భూము ల్లో ఎలాంటి కట్టడాలు నిర్మించొద్దంటూ సోమవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వేచి చూడాలని, ఒకవేళ ఇప్పటికే నిర్మాణాలు చేపడితే తుది తీర్పునకు లోబడి ఇకపై ముందుకు సాగాలని సూచించింది.

శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామ రెవెన్యూపరిధిలోని సర్వే నంబర్ 41/15లో కమ్మ, వెలమ తదితర సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి సర్కార్ ఒక్కో సంఘానికి ఐదెకరాల చొప్పున భూమిని కేటాయిస్తూ 2021 జూన్ 30న జీవో నంబర్  జారీ చేసింది. సర్కార్ కేటాయింపులను సవాల్ చేస్తూ విశ్రాంత ప్రొఫెసర్ వినాయక్‌రెడ్డి, సుంకర నరేశ్ తదితరులు గతంలో వేర్వేరుగా హైకోర్టులో పిల్స్ దాఖలు చేశారు.

వీటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుక యారాతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ..  రూ.కోట్లు విలువ చేసే భూమిని సర్కార్ నామమాత్రపు ధరకే  కుల సంఘాలకు కేటాయించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

సదరు భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆ వాదనలను విన్న ధర్మాసనం రాష్ట్రప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది. ఇకపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశించింది.