17 July, 2026 | 8:53 AM

మంత్రి పదవులకు పోటాపోటీ

05-06-2024 01:39 AM

సీరియల్‌లో బీజేపీ ఎంపీలు

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): తెలంగాణలో తొలి సారిగా 8 మంది పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. గోడెం నగేష్ (ఆదిలాబాద్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), రఘునందన్ రావు (మెదక్), ఈటల రాజేందర్ (మల్కాజ్‌గిరి), జి.కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్ నగర్) ఎంపీలుగా విజయం సాధించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ సికింద్రాబాద్ నుంచే ఎంపీగా గెలుపొందిన జి.కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

మొదట హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆయనకు ప్రధాని మోదీ కేబినెట్ మినిష్టర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. 2019లో తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు గెలిస్తే ఒక కేబినెట్ బెర్త్ దక్కింది. ఇప్పుడు 8 మంది ఎంపీలు గెలిచారు. గత ఎన్నికలతో పోలిస్తే దేశవ్యాప్తంగా బీజేపీకి ఈసారి సీట్లు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో మాత్రం రెట్టింపయ్యాయి. అందుకే కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో కనీసం రెండు నుంచి మూడు కేబినెట్ బెర్తులు దక్కుతాయని నూతన ఎంపీలు భావిస్తున్నారు.

గతంలో మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డికి మరోసారి పార్టీ కేబినెట్ ఆఫర్ ఇస్తుందనే పూర్తి భరోసాతో ఉన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన ఫైర్ బ్రాండ్ నేత బండి సంజయ్‌కు సైతం ఈ సారి కేంద్ర మంత్రిమండలిలో చోటు దక్కుతుందనే ప్రచారం నడుస్తోంది. ఇక తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసిన ఈటల రాజేందర్ కేసీఆర్‌తో విభేదించి బీఆర్‌ఎస్‌ను వదిలి బీజేపీలో చేరారు. మల్కాజ్‌గిరి నుంచి ఘన విజయం సాధించి తొలిసారిగా పార్లమెంట్‌కు వెళ్తున్నారు. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటలకు సైతం కేంద్ర మంత్రి మండలిలో చోటు దక్కే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు.

ఇక రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక మహిళా ఎంపీ అయిన డీకే అరుణ సైతం కేంద్ర కేబినెట్ రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలైన డీకే అరుణకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆమె అభిమానులు చెబుతున్నారు. ఇక ఉన్నత విద్యావంతులకు మంత్రి మండలిలో పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించే బీజేపీ ఈసారి అమెరికాలో ప్రొఫెసర్‌గా పనిచేసి తన పేరుపై ఎన్నో పేటెంట్‌లను కలిగి ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సైతం కేబినెట్ అవకాశం ఇస్తుందని ఆ పార్టీలోని కొందరు నేతలు చెబుతున్నారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా... కచ్చితంగా సామాజిక సమీకరణాలను సైతం పరిగణలోకి తీసుకుని బీజేపీ ఈసారి కేంద్ర కేబినెట్‌లో అవకాశాలు కల్పిస్తుందని తెలుస్తోంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరికి అమాత్య యోగం ఉందో తేలిపోనుంది. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి కేంద్ర కేబినెట్‌లో అవకాశాలు దక్కుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.