20 May, 2026 | 5:00 PM

కంటోన్మెంట్ రె‘ఢీ’

21-04-2024 01:20 AM

l అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు

l హోరాహోరీ ప్రచారాలతో ఓటర్ల ముందుకు 

l త్రిముఖ పోరులో విజయం ఎవరిదో?

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే తమ  అభ్యర్థులను ప్రకటించాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటే మే 13 తేదీన ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. కంటోన్మెంట్‌లో బీఆర్‌ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణాలతో మరణించగా, ఆయన కూతురు లాస్య నందితకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి అవకాశం కల్పించారు.

ఈ ఎన్నికల్లో నందిత విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని నెలలకే నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, మరోసారి సాయన్న కుటుంబం వైపే బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మొగ్గు చూపారు. సాయన్న కూతురు,  లాస్య నందిత సోదరి నివేదితకు బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ కేటాయించింది. కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడం, అలాగే సాయన్న కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం, సాయన్న చేసిన పలు సేవా కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రజలతో ఉన్న సత్సంబంధాలు నివేదితను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

కాంగ్రెస్ నుంచి నారాయణ్ శ్రీగణేష్..

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ కేటాయించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన నారాయణ్ శ్రీగణేష్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు, సీఎం రేవంత్ రెడ్డి చరిష్మా కలిసి ఉప ఎన్నికలో తన గెలుపు తథ్యం అనే ధీమాతో శ్రీగణేష్ ఉన్నట్లు తెలుస్తోంది. 

బీజేపీ అభ్యర్థిగా వంశీతిలక్..

బీజేపీ తమ అభ్యర్థిగా వంశీతిలక్ పేరును ప్రకటించింది. ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యుడిగా స్థిరపడిన వంశీ తిలక్ మొదటి ఎస్సీ మహిళా డిప్యూటీ స్పీకర్ టీఎన్ సదాలక్ష్మి కుమారుడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా సదాలక్ష్మి సేవలందించారు. కాంగ్రెస్ డెమోక్రసీ (బాబు జగ్జీవన్ రాం) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు.

వంశీతిలక్ తండ్రి టీవీ నారాయణ స్వాతంత్య్ర సమర యోధుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. విద్యాధికుడు, ఏపీపీఎస్సీ సభ్యుడిగా.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా కూడా పనిచేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వంశీతిలక్ ఈ ఎన్నికతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రచారాలు మొదలెట్టిన మూడు పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. త్రిముఖ పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.