శిశుగృహ పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి
కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
మహబూబాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): శిశు గృహాల్లో పిల్లల సంరక్షణ పట్ల, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలో నిర్వహిస్తున్న శిశుగృహ ప్రత్యేక దత్తత విభాగం, జిల్లా బాలల సంరక్షణ సేవల కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా శిశుగృహంలోని సదుపాయాలు, బాలల సంరక్షణ, పోషణ, ఆరోగ్య పరిస్థితులు, భద్రతా చర్యలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. అక్కడ ఉన్న చిన్నారులతో మమేకమై వారి ఆరోగ్యం, ఆహారం, సంరక్షణ విధానాలపై వివరాలు తెలుసుకున్నారు..శిశుగృహంలో పిల్లలకు శుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడంతో పాటు, వారి శారీరక మానసిక అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రత్యేక దత్తత ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించబడేలా చూడాలని ఆదేశించారు. అలాగే జిల్లా బాలల సంరక్షణ సేవల ద్వారా అవసరమైన సహాయం అందేలా కృషి చేయాలని, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.
కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ నిబంధనలకు అనుగుణంగా సిద్ధిపేట జిల్లా ఇందిరమ్మ కాలానికి చెందిన అర్హులైన దంపతులు జూపల్లి రాజు లక్ష్మీ దంపతులకు మూడు నెలల మగ శిశువును చట్టబద్ధమైన దత్తత కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఎం.విశ్వజ, ఇంచార్జి డిసిపివో ఎస్.ప్రవీణ్ కుమార్, శిశు గృహ ఇంచార్జి మేనేజర్ మాధవి, సోషల్ వర్కర్ సంగి చైతన్య పాల్గొన్నారు.




