4 July, 2026 | 2:43 AM

విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూడాలి

04-07-2026 02:07 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జులై 3 (విజయక్రాంతి): వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా నిర్వాహకులు, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హెచ్చరించారు.

శుక్రవారం రేగొండ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రైవేటు భవనంలో కొనసాగుతుండటంతో మరుగుదొడ్ల సమస్య కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే సమాచారంతో  నేరుగా పాఠశాలకు చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, వెంటనే భవనం యజమానిని పిలిపించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

విద్యార్థుల సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వెంటనే మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు అవసరమైన చోట కొత్త మరుగుదొడ్ల నిర్మాణం, స్నానాల కోసం నీటి నల్లాల ఏర్పాటు, డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని విద్యార్థులను ఇబ్బందులగు గురిచేస్తే సహించేది లేదన్నారు.   

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు తమకు ఉన్న సమస్యలను నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.  అనంతరం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఈడబ్ల్యూఐడీసీ ఏఈ జీవన్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, సర్పంచ్ మౌనిక, హెచ్ ఎం అపర్ణ పాల్గొన్నారు.