12 August, 2026 | 10:59 PM

కనువిందు చేస్తున్న తాళ్ల ఎల్లమ్మ చెక్ డ్యాం పరవళ్లు

12-08-2026 09:38 PM

గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మానేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం మత్తడి దూకుతూ పరవళ్ళు తొక్కడం ప్రాంత ప్రజలను, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. గంభీరావుపేట నుండి మల్లారెడ్డిపేటకు వెళ్లే ప్రధాన మార్గంలో తాళ్ల ఎల్లమ్మ సమీపంలో ఉన్న ఈ చెక్‌డ్యాం ఇటీవలి వర్షాల నేపథ్యంలో ఎగువ మానేరు మత్తడి దూకడంతో అందమైన దృశ్యాన్ని సృష్టిస్తోంది.

డ్యాంపై నుంచి ప్రవహిస్తున్న నీరు చిన్న జలపాతం లా కనిపిస్తూ అటుగా వెళ్తున్న వారిని ఆగి చూడాల్సిందేనని అనిపించేలా ఆకర్షిస్తోంది. ప్రకృతి అందాలు నిండిన ఈ దృశ్యం స్థానికులకు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా కనువిందు చేస్తోంది.చెక్‌డ్యాం వద్ద నీటి ప్రవాహం పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అయినప్పటికీ, ఈ పరవళ్ళు తొక్కుతున్న నీటి అందాలను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.