ఎన్నికల వేళ భారీ షాక్... టీవీకే విజయ్‌పై కేసు నమోదు
చెన్నై: ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ కు తమిళనాడు పోలీసులు షాకిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో పర్యటించినప్పుడు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో సహా, బీఎన్ఎస్ 2023లోని వివిధ సెక్షన్ల కింద విజయ్, ఆయన పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్లు NS 126 (2) (కార్యకలాపాలకు స్వచ్ఛందంగా ఆటంకం కలిగించడం), సెక్షన్ 189 (2), అలాగే 223 బీఎన్ఎస్ 3(A), 3(5) కింద పెరవల్లూరు పోలీసులు కేసులు నమోదు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
అధికారులు ప్రచారానికి అనుమతించిన సమయానికి ముందే పార్టీ కార్యకర్తలు గుమిగూడటం ద్వారా ప్రజలకు అసౌకర్యం కలిగిందన్న ఆరోపణలు వెలువడ్డాయి. విజయ్ రోడ్‌షో నిర్వహణ కోసం ఏకంగా 30 సౌండ్ సిస్టమ్‌లను వినియోగించారని, ఈ ర్యాలీ ప్రజలకు ఇబ్బంది కలిగించడంతో పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించిందని ఆరోపణలున్నాయి. విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కజగం' పార్టీ, 2026 అసెంబ్లీ ఎన్నికల ద్వారా తన ఎన్నికల అరంగేట్రం చేస్తోంది. విజయ్ తాను పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలలో ఒకటైన పెరంబూరు నుండి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.




