డేంజర్.. కూల్ డ్రింక్..!
- అపరిశుభ్రమైన నీటితో ఐస్ తయారీ..?
- అదే ఐస్‌ని వినియోగిస్తున్న జ్యూస్ సెంటర్ నిర్వాహకులు
- వేసవి తాపానికి శీతల పానీయాలు సేవిస్తున్న ప్రజలు
- ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయంటున్న వైద్య నిపుణులు
సూర్యాపేట, మార్చి 31 (విజయక్రాంతి) : ప్రస్తుతం భానుడు భగభగ మంటున్నాడు. రోజురో జుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో అందరి గొంతెండిపోతోంది. ప్రజలు ఉక్కపోతకు తట్టుకోలేక ఉపశమనం కోసం పరుగులు తీస్తున్నారు. దాహార్తిని తీర్చుకునేందుకు చెరుకు, పండ్ల రసాలు, మజ్జిగ ఇతర పానీయాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ సెంటర్లకు గిరాకీ విపరీతంగా పెరిగింది. ఇదే అదనుగా ఎక్కడపడితే అక్కడ జ్యూస్, చెరుకు రసం దుకాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి.చాలా మంది చల్లదనం కోసం ఐస్ లేనిదీ ఆ పానీయాలను ముట్టుకోవడంలేదు.
ఇంకొందరైతే అడిగి మరీ మరిన్ని ఐస్ గడ్డలు వేయించుకుంటారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా, శుభ్రత పాటించకుండా ఈ కేంద్రాల్లో విక్రయాలు కొనసాగిస్తున్నారు. అపరిశుభ్రమైన నీటితో తయారు చేసే జ్యూస్ వల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు తప్పవని వెద్యనిపుణులు చెబుతున్నారు.
ఎండాకాలమే వెలుస్తున్న దుకాణాలు..
వేసవి వచ్చిందంటే పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెరుకు, పండ్ల రసాలు, లస్సి, మజ్జిగ తదితర పానీయాలను విక్రయించే దుకాణాలు వెలుస్తున్నాయి, ప్రస్తుతం జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, ప్రధాన కూడలిలో ఇలాంటి దుకాణాలు 2వేల వరకు ఉంటాయనీ అంచనా. ఎండ కాలంలో బయటకు వచ్చే పట్టణ వాసులతో పాటు బయట ప్రాంతాల నుంచి వచ్చే వారిలో కనీసం 50 నుంచి 60శాతం మంది ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా చల్లని పానీయాన్ని సేవిస్తున్నారు. కొందరు.
వ్యాపారుల్లో అవగాహన లేక పానీయాల్లో చల్లదనం కోసం ఆపరిశుభ్ర వాతావరణంలో, కలుషిత నీటితో తయారు చేసిన ఐస్ ను వినియోగిస్తున్నారు. అందుకే వేసవిలో ఆసుపత్రుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుందని వైద్యులు చెపుతున్నారు. వాస్తవానికి పండ్ల రసాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే. ఆయా పండ్ల రసాల్లో కలిపిన ఐస్ అనారోగ్యానికి దారితీస్తోంది. జిల్లా కేంద్రం లో కొందరు. వ్యాపారులు ఆపరిశుభ్రత నీటితో ఐస్ తయారీ చేసి విక్రయిస్తున్నారు.
గుర్తించడం కష్టం..
సాధారణంగా ఐస్‌ను చూడగానే ఇది మంచి నీటితో తయారైందా లేదా అన్న విషయాన్ని మనమే కాదు. నిపుణులు సైతం అప్పటికప్పుడు గుర్తించలేదు. ప్రస్తుతం మార్కెట్లో పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే ఐస్ తో పాటు ఎడిబుల్ రకం అందుబాటులో ఉంది. మొదటి రకాన్ని చేపలు, మాంసాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు.. పండ్లు, ఇతర వస్తువు లను ఎగుమతి చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు. శవాలను భద్రపరిచే మార్చరీల్లో వినియోగిస్తారు. దీని ధరచాలా తక్కువగా ఉంటుంది. ఒక్కో పెద్ద క్యూబ్ రూ. 30 నుండి రూ.50 వరకు లభిస్తుంది.
ఈ రకం ఐస్ ను తయారీ మంచి నీటిలో పరిశుభ్రత వాతావారణంలో తయారు చేయాలనే నిబంధనలు ఏమి లేవు. ఒక ఎడిబుల్ విషయానికొస్తే ఖచ్చితంగా నియామాలను పాటించాలి. మంచి నీటినే వినియోగించాలి. కాకపోతే ధరచాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కో క్యూబ్ రూ. 150 వరకు లభిస్తుంది. శీతల పానీయాల్లో ఎడిబుల్ ఐస్ ను వినియోగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కానీ చాలా మంది చిరు వ్యాపారులు ఖర్చు తగ్గించుకునేందుకు మొదటి రకం ఐస్ ను వినియోగించేందుకే మొగ్గు చూపుతున్నారు. వివిధ రకాల బాక్టీరియాలు, ఇతర రకాల క్రీములు ఉంటాయి. అవి పండ్ల రసాల్లో కలిసిపోయి అనారోగ్యం కల్గిస్థాయి. ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున అధికారులు తనిఖీలు నిర్వహించి అపరిశుభ్రమైన నీటితో తయారు చేసిన ఐసును వాడే జ్యూస్ సెంటర్లు పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇబ్బందులకు అవకాశం...
నాణ్యత లేని ఐస్ వాడడంతో గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, టైపాయిడ్ , వైరల్ జ్వరాలు తదితర ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే ఆవకాశం ఉంది. రోటా, ఆడినో, హెపటైటీస్ వంటి వైరస్లతో ఊపిరితిత్తు సమస్యలు, పచ్చకామెర్లు సంభవిస్తాయి. గొంతు నొప్పి, జలులు, దగ్గు బారిన పడతారు. రోగనిరోధక శక్తి తగ్గి పోయి నీరసంగా తయారవుతారు. చిన్నపిల్లలకు గవద బిళ్లల వ్యాధి వస్తుంది. కాబట్టి ప్రజలు జ్యూసులు సేవించేటప్పుడు అన్ని గమనించి తదుపరి సేవించడం మంచిది.
పి.అంజిరెడ్డి, వైద్యుడు, సూర్యాపేట




