కేజ్రీవాల్‌కు సీబీఐ కస్టడీ..
- మూడు రోజుల కస్టడీకి ఇచ్చిన కోర్టు
- బుధవారం కోర్టులోనే అరెస్టు చేసిన సీబీఐ
- శాఖలు లేకున్నా అంతా కేజ్రీ కనుసన్నల్లోనే..
- ఢిల్లీ సీఎంను విచారించాల్సిదేనని వాదన
న్యూఢిల్లీ, జూన్ 26: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు ౩ రోజుల సీబీఐ కస్టడీ విధించింది. లిక్కర్ కేసులో ఆయనను విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈ కేసులో తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను.. సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొని బుధవారం కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడే ఆయనను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఈడీ కేసులో తనకు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ మీద హైకోర్టు విధించిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీఎం.. సీబీఐ అదుపులోకి తీసుకోవడంతో ఆ పిటిషన్‌ను కూడా వెనక్కి తీసుకున్నారు.
అంతా ఆయన కనుసన్నల్లోనే..
ఢిల్లీ సీఎం వద్ద ఎటువంటి శాఖ లేకపోయినా అన్ని శాఖల్లో ఆయన ప్రమేయం ఉందని సీబీఐ ఆరోపించింది. జూన్ 25న జైలులో కేజ్రీవాల్ స్టేట్‌మెంట్ తీసుకుంది. ఆప్ హెడ్‌గా పనిచేసిన విజయ్ నాయర్‌కు కూడా దీనితో సంబంధాలున్నాయని సీబీఐ కోర్టుకు తెలిపింది. మంత్రులు అతిశీ, సౌరభ్ భరద్వాజ్ దగ్గర విజయ్ పని చేశాడు. సీబీఐ వాదనలను కేజ్రీవాల్ లాయర్ తోసిపుచ్చారు. ఇదంతా చూస్తుంటే ఆందోళన, భయం కలుగుతోందని.. వాదనలను రేపు వినిపించేందుకు, అన్ని రకాల పత్రాలను యాక్సెస్ చేసేందుకు తమకు అనుమతి మంజూరు చేయాలని కోర్టును కోరారు. సీబీఐ లాయర్ స్పందిస్తూ.. సీబీఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సమాచారం ఇవ్వాలనే నిబంధన చట్టంలో లేదని తెలిపారు. ప్రశ్నించేందుకు వీలుగా సీఆర్పీసీలో ఉన్న సెక్షన్ 41 కింద నోటీసులు ఇవ్వలేదని కేజ్రీవాల్ లాయర్ వాదనలు వినిపించారు. ఇప్పుడు ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేసేందుకు అనుమతిస్తే.. తుపాకీతో కాల్చేసేందుకు పర్మిషన్ ఇచ్చినట్లేనని చెప్పారు.
నెక్ట్స్ ఎవరో?
ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థలు.. ఆ జాబితాలో నెక్ట్స్ ఎవరని అంతా చర్చించుకుంటున్నారు. సీఎం కేజ్రీవాల్‌ను ఇది వరకే అరెస్ట్ చేసి జైలుకు పంపినా కానీ ఆయన మాత్రం తన సీఎం పదవికి రాజీనామా చేయలేదు.
సీఎం షుగర్ లెవల్స్ డౌన్..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఆయన కోర్టు హాలులో ఉండగానే మరోసారి ఆయన షుగర్ లెవల్స్ పడిపోయాయి. దీంతో సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను బయటకు తీసుకువెళ్లి ఛాయ్ తాగిపించి.. బిస్కట్స్ తినిపించారు. దీంతో కొద్దిసేపటి తర్వాత ఆయన తేరుకున్నా రు. ఆ సమయంలో కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ కూడా అక్కడే ఉన్నారు. అలాగే ఆప్ ముఖ్యనాయకులు కూడా ఉన్నారు.






