నీట్‌పై రంగంలోకి సీబీఐ
- ఎఫ్‌ఐఆర్ నమోదు
- బీహార్, గుజరాత్‌లో విచారించనున్న దర్యాప్తు సంస్థ
పేపర్ లీకేజీలో మహారాష్ట్ర వ్యక్తులకు సంబంధం
నీట్ పునఃపరీక్షకు భారీగా విద్యార్థుల గైర్హాజరు
న్యూఢిల్లీ, జూన్ 23: దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీలో ప్రతి రోజూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సమగ్రంగా దర్యాప్తు చేయాలని నిర్ణయిం చిన కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నీట్ వ్యవహారంలో ఆదివారం సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసింది.
నీట్‌లో జరిగిన పూర్తి అవకతవకలతో పాటు బీహార్‌లో పేపర్ లీక్, పలుచోట్ల విద్యార్థులు సమయం కోల్పో యిన నేపథ్యంలో గ్రేస్ మార్కులు కలపడం వంటి అంశాలపైనా సమగ్రంగా విచారించనుంది. విద్యాశాఖ సూచనల మేరకు ఈ కేసులో గుర్తుతెలియని వ్యక్తులను సీబీఐ చేర్చినట్లు తెలిపింది. పరీక్షలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించిన అనంతరం సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
కేసు విచారణలో భాగంగా బీహార్, గుజరాత్‌లో సీబీఐ విచారణ చేపట్టనుంది. అంతేకాకుండా పేపర్ లీకేజీలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయుల హస్తం ఉన్నట్లు నాందేడ్ ఏటీఎస్ విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రేస్ మార్కులు పొందినవారికి రీఎగ్జామ్ నిర్వహించగా 1,563 మంది విద్యార్థులకు గాను సగం మంది గైర్హాజరు అయ్యారు. కేవలం 813 మంది (52 శాతం) మాత్రమే హాజరైనట్లు ఎన్టీయే ఆదివారం సాయంత్రం ప్రకటించింది.
పునఃపరీక్షకు అభ్యర్థుల గైర్హాజరు
ఇదిలా ఉండగా, సమయం వృథా వల్ల గ్రేస్ మార్కులు పొందిన 1,563 విద్యార్థులకు సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్లీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష నిర్వహించాల్సి ఉంది. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రం గేట్లు మూసేస్తారు. అయితే చాలా మంది విద్యా ర్థులు పునఃపరీక్షకు గైర్హాజరు అయ్యారు. 750 మంది అభ్యర్థులు పరీక్షకు రాలేదని ఎన్టీయే తెలిపింది. వీరిలో ఛండీగఢ్‌లో ఇద్దరు అభ్యర్థుల కోసం ఓ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరుకాలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్‌లో 185 మంది అభ్యర్థులకు గాను 70 మంది హాజరు కాలేదు.
ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలు మారడంతో పాటు మేఘాలయ, హర్యానా, ఛత్తీస్‌గఢ్, సూరత్, ఛండీగఢ్‌లోని మొత్తం ఆరు పరీక్షా కేంద్రాల్లో ఓఎంఆర్ షీట్లు చిరిగిపోవడం, ఒక పేపర్‌కు బదులు మరో పేపర్ ఇవ్వడం, వీటివల్ల పరీక్ష నిర్వహణలో జాప్యం వంటి కారణాలతో 1,563 మంది అభ్యర్థులకు నష్టపరిహారం కింద గ్రేస్ మార్కులను ఇచ్చారు. వీటివల్ల 67 మంది 720 మార్కులకు 720 మార్కులు రావడంతో నీట్ వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వీరికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ 67 మందిలో చాలా మంది ఒకే పరీక్షా కేంద్రానికి చెందినవారు కావడంతో పేపర్ లీక్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి.
డిజిటల్ లాకర్లు పనిచేయక..
మరోవైపు నీట్, యూజీసీ నెట్ పరీక్షల విషయంలో మరో కీలక పరిణామం వెలుగుచూసింది. ఎన్టీయే వివిధ పరీక్షా కేంద్రాలకు నీట్ ప్రశ్నాపత్రం పంపిన డిజిటల్ లాకర్లు సరిగ్గా పనిచేయలేదని బీహార్ ఆర్థిక నేరాల విభాగం (ఈవోయూ) తెలిపింది. ఈ డిజిటల్ లాకర్లు పరీక్షా సమయానికి అనుగుణంగా ఓపెన్ కావాల్సి ఉంటుంది. కానీ, పలు కేంద్రాల్లో ఇవి తెరుచుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో మ్యానువల్ వీటిని తెరిచి అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు అందించడంలో జాప్యం జరిగినట్లు గుర్తించారు.
ఈ ఆలస్యం కారణంగానే పలువురు అభ్యర్థులకు గ్రేస్ మార్కులు కలపాల్సి వచ్చినట్లు ఎన్టీయే ఇప్పటికే వివరించింది. హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో విజయ్ స్కూల్, ఎస్‌ఆర్ సెంచరీ స్కూల్, హర్‌దయాల్ పబ్లిక్ స్కూల్‌లోనూ ఇలాంటి కారణంతోనే ప్రశ్నాపత్రాల పంపిణీ ఆలస్యమైంది. ఈ అభ్యర్థులకు 30 నిమిషాలు అదనంగా సమయంతో పాటు గ్రేస్ మార్కులు అందించారు. అయితే, హర్‌దయాల్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన అభ్యర్థులకే ఈ గ్రేస్ మార్కులు ఇవ్వడం గమనార్హం. ఈ విషయాలపై ఈవోయూ తన నివేదికను కేంద్ర విద్యాశాఖకు శనివారమే అందించినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రకు లింకు..
నీట్ పేపర్ లీక్‌లో మహారాష్ట్రకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇద్దరు ఉపాధ్యాయులను మహారాష్ట్ర పోలీసులు ప్రశ్నించడంతో మరికొన్ని అంశాలు వెలుగుచూశాయి. లీకేజీలో సంజయ్ తుకారం జాదవ్, జలీల్ ఉమర్‌ఖాన్ ప్రమేయం ఉన్నట్లు తెలిసి నాందేడ్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీఎస్) వారిని అదుపులోకి తీసుకుంది. వీరిద్దరు జిల్లా పరిషత్ పాఠశాలల్లో బోధకులుగా పనిచేస్తూనే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను నడుపుతున్నారు. కొన్ని గంటల పాటు వీరిని విచారించిన తర్వాత విడుదల చేశామని, అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి.






