8 April, 2026 | 4:10 AM

భద్రతకు సీసీ కెమెరాలే రక్షణ కవచం

08-04-2026 01:08 AM

గ్రామ సందర్శనలో ఎస్పీ

మహబూబాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): నేరాల అదుపు, భద్రత అంశాల్లో సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయని, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా ఎస్పీ గ్రామ సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని గూడూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ గదులు, రికార్డుల నిర్వహణ, పని విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. స్టేషన్లో సిబ్బంది సంఖ్య, వారి విధుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి గురించి గూడూరు ఎస్ ఐ గిరిధర్ ను  అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, గ్రామపంచాయతీల వివరాలు, అక్కడ అమలు చేస్తున్న భద్రతా చర్యలపై సమగ్రంగా చర్చించారు.

అనంతరం ఎస్పీ ఎంపిక చేసిన గ్రామపంచాయతీ అయిన పోనుగోడు గ్రామాన్ని సందర్శించి గ్రామంలో హెల్మెట్ వినియోగం అమలు, సీసీ కెమెరాల ఏర్పాటు, పర్యవేక్షణ విధానాన్ని పరిశీలించారు. గ్రామస్థులు తీసుకున్న నిర్ణయాలతో హెల్మెట్ వినియోగం కచ్చితంగా అమలవుతున్న తీరు, గ్రామమంతా సీసీ కెమెరాల కవరేజీలో ఉండడం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు..ప్రజలు, పోలీస్ శాఖ కలిసి పనిచేస్తే గ్రామాలను నేర రహితంగా, సురక్షితంగా మార్చుకోవచ్చని ఎస్పీ  తెలిపారు.