calender_icon.png 21 February, 2026 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వయం ఉపాధికి సిడిఎ చేయూత

21-02-2026 09:47:37 PM

పేద మహిళలకు ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ 

 శిక్షణతో పాటు ధ్రువపత్రాలు

కల్లూరు,(విజయక్రాంతి): పేద, మధ్యతరగతి మహిళల ఆర్థిక సాధికారత లక్ష్యంగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ (సిడిఎ) ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా స్వావలంబన సాధించి కుటుంబ అభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రముఖ వైద్యురాలి చేతుల మీదుగా పంపిణీ

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ మాధవి లబ్ధిదారులకు కుట్టుమిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల ఆర్థిక బలోపేతమే సమాజ పురోగతికి పునాది అని పేర్కొన్నారు. ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సిడిఎ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని అభినందించారు.

ప్రతి ఏడాది 100 మందికి శిక్షణ

సిడిఎ కార్యదర్శి పి. ఏనోష్ కుమార్ మాట్లాడుతూ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2023 నుంచి ప్రతి సంవత్సరం 100 మంది మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు కుట్టుమిషన్‌తో పాటు శిక్షణ ధ్రువపత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు.శిక్షణ పొందిన వారు స్వంతంగా కుట్టు కేంద్రాలు ప్రారంభించి ఆదాయం పొందుతూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని వివరించారు.

350 ఉచిత నీటి బోర్లు

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని సి డి ఎ ఆధ్వర్యంలో మంచినీటి బోర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఇప్పటివరకు 350 ఉచిత నీటి బోర్లు ఏర్పాటు చేసి అనేక గ్రామాల్లో ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.

విద్యార్థులకు భోజనం, వసతి

సంస్థ నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఫీడింగ్ సెంటర్ ద్వారా 120 మంది పేద విద్యార్థులకు భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరమవుతున్న పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

దాతల సహకారంతో సేవలు

సిడిఎ చేపడుతున్న సేవా కార్యక్రమాలు దాతలు,స్నేహితుల సహకారంతో కొనసాగుతున్నాయని పి.ఏనోష్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో మరింత మంది మహిళలు, విద్యార్థులకు సహాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ మాధవిని శాలువాతో సన్మానించారు. లబ్ధిదారులు సిడిఎ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్నా బాలరాజు, ఏఐసీసీ మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి, డేవిడ్ రాజు మండల అధ్యక్షులు తేళ్ల ఎబినేజర్, సిస్టర్ చంద్రలీల, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు, వాలంటీర్లు పాల్గొన్నారు.