11-11-2025 05:36:39 PM
డీఎస్పీ కె.శివరాం రెడ్డి..
నకిరేకల్ (విజయకాంత్రి): నకిరేకల్ పోలీసులు సీఈఐఆర్(CEIR) పోర్టల్ ద్వారా రూ.4 లక్షల విలువ గల 31 మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మంగళవారం నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కె.శివరాం రెడ్డి సమావేశంలో మాట్లాడుతూ, స్మార్ట్‌ఫోన్ వినియోగం విస్తృతంగా పెరగడంతో ఫోన్లు పోగొట్టుకునే ఘటనలు కూడా పెరిగాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రారంభించిన సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు అనేక మంది బాధితులు తమ ఫోన్లు తిరిగి పొందినట్లు వివరించారు. ఫోన్ పొయినా వెంటనే సిమ్ బ్లాక్ చేయడం, బ్యాంక్ ఖాతాలను రక్షించుకోవడం అవసరం.
తరువాత CEIR పోర్టల్‌లో ఫోన్ నష్టం రిజిస్ట్రేషన్ చేయాలని ఆయన సూచించారు. గుర్తు తెలియని లింకులు, APK ఫైల్స్, OTP లేదా బ్యాంక్ వివరాలకు సంబంధించిన కాల్స్ వచ్చినప్పుడు వాటిని ఓపెన్ చేయకూడదు, స్పందించకూడదని ఆయన తెలిపారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా 1930 సైబర్ క్రైమ్ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. సెల్‌ఫోన్ రికవరీలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ వై. వెంకటేశ్వర్లును డీఎస్పీ అభినందించారు. తమ ఫోన్లు తిరిగి అందుకున్న బాధితులు డీఎస్పీ కె.శివరాం రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఎస్సైలు వీరబాబు, కృష్ణాచారి, పోలీస్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.