పుస్తెలతాడు సైజు పేరిట మోసం
- ఇద్దరు నిందితుల అరెస్ట్
సిద్దిపేట క్రైం: నమ్మించి మోసానికి పాల్పడి, అసలు పుస్తెలతాడు స్థానంలో నకిలీది ఇచ్చిన ఇద్దరు వ్యక్తులను సిద్దిపేట టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన గున్నాల అనురాధ అనే మహిళకు సిద్దిపేటలో నివాసం ఉంటున్న ఆమె మేనమామ కొడుకు ఎల్ల రాజు గతేడాది డిసెంబర్ 19న ఫోన్ చేశాడు. తన భార్యకు పుస్తెలతాడు చేయించాలని, అనురాధ మెడలో ఉన్న తాడు బాగుందని, దాని సైజు ఇస్తే అలాగే చేయిస్తానని నమ్మబలికాడు.
అతని మాటలు నమ్మిన అనురాధ సిద్దిపేటకు రాగా, రాజు ఆమెను పారుపల్లి వీధిలోని 'భానుశ్రీ జ్యువెలర్స్' దుకాణానికి తీసుకెళ్లాడు. అక్కడ పనిచేసే సిరికొండ నాగరాజుకు ఆ పుస్తెలతాడును ఇచ్చి, సైజు తీసుకోవడానికి సమయం పడుతుందని చెప్పి అనురాధను ఇంటి దగ్గర విడిచిపెట్టాడు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ వద్దకు పిలిపించి ఆమెకు పుస్తెలతాడును తిరిగి ఇచ్చేశాడు. ఇంటికి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత అనురాధ తన వద్ద ఉన్న పుస్తెలతాడును పరిశీలించగా, అది నకిలీది అని గుర్తించింది.
రాజు, నాగరాజు కలిసి తన బంగారు పుస్తెలతాడును కాజేసి, మోసం చేశారని గ్రహించి సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఎల్లరాజు, నాగరాజులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకుని, నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. పరిచయస్తులైనా, బంధువులైనా బంగారు ఆభరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ సూచించారు.




