డిజిటల్ విధానంలో జనాభా లెక్కలు
నాగర్ కర్నూల్ మార్చి 15 (విజయక్రాంతి): 2027 జనగణన దేశ అభివృద్ధికి ఎంతో కీలకమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. జిల్లాలో జనగణన విధులను పక్కాగా నిర్వహించి 100 శాతం గణన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జనాభా వివరాల ఆధారంగా మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల రూపకల్పనకు ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన కలుగుతుందన్నారు.
జనగణన2027 నేపథ్యంలో తహసీల్దార్లు, మండల విద్యాధికారులు, సెన్సస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టర్ ప్రారంభించారు.2011లో చివరిసారి జనగణన జరిగిందని, కరోనా కారణంగా 2021లో నిర్వహించలేకపోయామన్నారు.
ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ చేపడుతున్నామని పేర్కొన్నారు. మొదటి దశలో గృహాల జాబితా, రెండో దశలో వ్యక్తిగత వివరాలు సేకరించనున్నట్లు చెప్పారు.మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో మాస్టర్ ట్రైనర్లు అధికారులకు జనగణన విధానాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రజలు నిజమైన వివరాలు ఇవ్వాలని, సేకరించిన సమాచారం సురక్షితంగా సర్వర్లో భద్రపరచ బడుతుందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా పరిషత్ సీఈవో దేవ సహాయం, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాత తదితరులు పాల్గొన్నారు.




