రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
- కేంద్ర సహాయ మంత్రి సోమన్న
హుజూరాబాద్, జూన్ 18 : రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర జల శక్తి, రైల్వే సహాయమంత్రి సోమన్న అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో 17వ పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమన్న మాట్లాడుతూ.. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ప్రారంభించిన పీఎం కిసాన్ యోజన రైతులకు ప్రయోజనకరంగా మారిందన్నారు. 16 విడతలు రైతులకు సహాయం అందించామని తెలిపారు. ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, ఎరువుల కోసం రూ.కోట్ల సబ్సిడీని అందిస్తున్నామని స్పష్టంచేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు అందించడానికి అన్ని చర్యలు తీసుకున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.






