21 May, 2026 | 6:01 AM

ఫార్మా హబ్‌గా హైదరాబాద్

19-06-2024 12:58 AM

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరాన్ని ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. కోవిడ్ సమయంలో 30 శాతం మందులు తెలంగాణ ఫార్మా కంపెనీల నుంచే ఉత్పత్తి అయ్యాయన్నారు. సరోజినీనాయుడు వనితా ఫార్మసీ మహావిద్యాలయం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మహావిద్యాలయం చైర్మన్ డాక్టర్ ప్రభాశంకర్ అధ్యక్షత వహించగా, మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లా డుతూ.. పరిశ్రమలకు కళాశాలలకు మధ్యనున్న అంతరాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.

అందుకు నైపుణ్యాలు, రీస్కిల్లింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అధిక ప్రాముఖ్యం ఇస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రతి డిగ్రీ కోర్సు ఫైనల్ ఇయర్‌లో విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేయడాన్ని తప్పనిసరి చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థుల అభివృద్ధి, వారి అవసరాలకు అనుగుణంగా ప్రిన్సిపాల్స్, మేనేజ్‌మెంట్స్ కళాశాలల్లో బోధన చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ కళాశాల 25 సంవత్సరాల మైలురాయిని చేరుకోవడం పట్ల శ్రీధర్‌బాబు యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 121 ఫార్మా కళాశాలల్లో 6 బాలికల కాలేజీలు ఉన్నాయన్నారు. వీటిలో ఈ కాలేజీ ఉత్తమమైనదని కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబును కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో అష్ఫక్ అహ్మద్, గంగాధర్‌రావు, బీఎన్ రాజేశ్వరరావు, జీవీ రంగారెడ్డి, బీ హనుమం తరావు తదితరులు పాల్గొన్నారు.