calender_icon.png 20 July, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్విప్మెంట్ మానిటరింగ్‌కు సెంట్రల్ పోర్టల్

13-12-2024 01:56:51 AM

  • జిల్లాకో బయో మెడికల్ ఇంజనీర్ నియామకం
  • సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి
  • రాష్ట్రస్థాయి నుంచి పీహెచ్‌సీ వరకు పర్యవేక్షించాలి
  • గడువుకు 3 నెలల ముందే మెడిసిన్ వాడాలి 
  • వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): డ్రగ్స్, ఎక్విప్మెంట్ మానిటరింగ్ కోసం త్వరలో సెంట్రల్ పోర్టల్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఒక్కో స్థాయిలో ఒక్కో అధికారికి బాధ్యతలు అప్పగించాలని అధికారులకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి.. రాష్ర్టస్థాయి నుంచి మండలస్థాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ దవాఖాన్లలో డయాగ్నొస్టిక్ ఎక్విప్మెంట్, ఫైర్ సేఫ్టీ, మెడిసిన్ తదితర అంశాలపై ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు.  ఇటీవల ప్రభుత్వ దవాఖాన్లలో తనిఖీలు చేసిన పది టాస్క్‌ఫోర్స్ బృందాలు తయారు చేసిన నివేదికను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఔషధాల జాబితా తరహాలోనే ముఖ్యమైన పరికరాల జాబితాను తయారు చేయాలని సూచించారు.

పరికరాలను నిర్ణీత సమయంలో రిపేర్ చేయకపోతే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ర్టస్థాయిలో చీఫ్ బయో మెడికల్ ఇంజనీర్ పోస్ట్‌ను క్రియేట్ చేసి.. జిల్లాకో బయో మెడికల్ ఇంజనీర్‌ను తాత్కాలిక పద్ధతిలో తక్షణమే నియమించాలని మంత్రి ఆదేశించారు. పరికరాల నిర్వహణకు స్టాఫ్ తప్పనిసరి ఉండేలా చూసుకోవాలన్నారు. ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా రిపేర్‌లో పెడితే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మెడిసిన్ సరఫరాలో నిర్లక్ష్యం వహించొద్దని.. గడువుకు 3 నెలల ముందే మెడిసిన్‌ను వినియోగించాలని, లేనిపక్షంలో వెనక్కి పంపించాలని సూచించారు. సెంట్రల్ మెడిసినల్, హాస్పిటల్ ఫార్మసీ స్టోర్లలో తరచూ తనిఖీలు చేయాలన్నారు. అవసరానికి మించి మెడిసిన్, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేసే వారిపై కఠిన చర్యలుంటాయని మంత్రి  హెచ్చరించారు.

ఫైర్ సేఫ్టీపై తనిఖీలు చేసేందుకు ప్రతి హాస్పిటల్లో డెడికేటెడ్ ఆఫీసర్‌ను నియమించాలన్నారు.  సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో శివశంకర్, డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.