calender_icon.png 19 July, 2025 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యత లోపిస్తే సహించబోం

13-12-2024 01:52:34 AM

  • ముడి సరుకుల సప్లయర్స్‌తో రాజీపడొద్దు
  • నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు 
  • టీం వర్క్‌గా పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు
  • టీజీ ఫుడ్స్ పనితీరుపై మంత్రి సీతక్క ఆగ్రహం

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): అంగన్‌వాడీలకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. టీజీ ఫుడ్స్ పనితీరుపై గురువారం సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. సమావేశానికి టీజీ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ.ఫహీం, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, టీజీ ఫుడ్స్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీజీ ఫుడ్స్ కార్పొరేషన్ పనితీరు, అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించడమేంటని ప్రశ్నిం చారు. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నా తీరు మార్చుకోకపోవడంపై ఆమె మండిపడ్డారు. అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. నాణ్యత, శుభ్రత లేని సరుకులు సప్లు చేసిన కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని ఆదేశించారు.

నాసిరకం సరుకులు సప్లు చేసే కాంట్రాక్టర్లు, సహకరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్‌వాడీలను తరచూ సందర్శిస్తూ తప్పులు జరిగితే బాధ్యులను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. టీం వర్క్‌గా పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. సరుకుల సప్లయర్స్‌తో రాజీ పడాల్సిన అవసరం లేదన్నారు. భువనగిరిలో బాలామృతం దారి మళ్లింపు ఘటనపై విచారణకు చేసి బాధ్యులను విధుల్లోంచి తొలగించాలని ఆదేశించారు.

టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. లక్షల మంది చిన్నారుల భవితవ్యంతో కూడుకున్న అంశమైనందున బాధ్యతతో విధులు నిర్వర్తించాలని, లేని పక్షంలో విధుల నుంచి తొలగిస్తామని మంత్రి హెచ్చరించారు.