కరీంనగర్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్
49,025 మంది విద్యార్థులకు ‘స్కూల్ బ్రేక్ ఫాస్ట్ ప్రోగ్రామ్’-
16న ప్రారంభించనున్న మంత్రి పొన్నం
కరీంనగర్, సెప్టెంబరు 15 (విజయక్రాంతి): పాఠశాల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారాన్ని అందించడం ద్వారా వారి ఆరోగ్యం, ఏకాగ్రత, హాజరు, విద్యా సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్టనర్ గా చేపట్టిన ‘ స్కూల్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్(School Breakfast Program)‘ ను కరీంనగర్ జిల్లాలో విస్తరిస్తోంది.
ఇందులో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో సుమారు 8 కోట్ల వ్యయంతో రోజుకు 50 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందించే సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను 16న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రారంభించనున్నారు. కరీంనగర్లోని ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లోని 17 మండలాల పరిధిలో 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన మొత్తం 49,025 మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందించనున్నారు.
ఈ కార్యక్రమాన్ని హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్గా అమలు చేయనుంది. ఉదయం పూట విద్యార్థులు ఆకలితో ఉండకుండా పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం వల్ల వారు పాఠశాలలో చురుకుగా పాల్గొనే అవకాశం పెరుగుతుంది. అల్పాహారం విద్యార్థుల ఏకాగ్రత, జ్ఞానాత్మక సామర్థ్యం, భావోద్వేగ అభివృద్ధి, తరగతి గది భాగస్వామ్యం, విద్యా పనితీరు మెరుగుపడేందుకు దోహదపడుతుంది. అల్పాహారం అందుబాటులో ఉండటం వల్ల పాఠశాల హాజరు కూడా పెరుగుతుంది.
ముఖ్యంగా ఉపాధి కోసం తెల్లవారుజామునే పనులకు వెళ్లే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు ఇది ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ అల్పాహార కార్యక్రమాన్ని 2024 డిసెంబర్లో కోడంగల్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అక్కడ కార్యక్రమం అమలుతో విద్యార్థుల హాజరు 75 శాతం నుంచి 90 శాతానికి పెరిగినట్లు గుర్తించారు. కోడంగల్లో పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్ల ద్వారా ప్రతిరోజూ విద్యార్థులకు పోషకమైన, పరిశుభ్రమైన, నాణ్యమైన అల్పాహారాన్ని నిర్ణీత సమయంలో అందించేందుకు వీలు కలుగుతుంది. దోస, మిల్లెట్ ఇడ్లీ, పూరీ వంటి ప్రత్యేక మెనూలను పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఒకే విధమైన నాణ్యతతో అందించడం కేంద్రీకృత వంటశాలల ద్వారా సాధ్యమవుతుంది. అలాగే వంటగది పనుల నుంచి ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది విముక్తి పొంది పూర్తిగా బోధన, విద్యార్థుల అభ్యాసంపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది.-
49,025 మందికి అల్పాహారం..
విద్యార్థులు సాధారణంగా ఇళ్లలో తినే ఆహార పదార్థాలను ఆధారంగా చేసుకుని మెనూను రూపొందించారు. దీంతో విద్యార్థులు సులభంగా స్వీకరించడంతో పాటు ఆహార వృథాను తగ్గించవచ్చు. సోమవారం ఇడ్లీ సాంబార్, మంగళవారం పూరీ - ఆలూ కుర్మా, బుధవారం దోశ చట్నీ, గురువారం ఉప్మా చట్నీ, శుక్రవారం మిల్లెట్ ఇడ్లీ సాంబార్, శనివారం బోండా చట్నీ, రోజు విడిచి రోజు పాలు కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో 16,544 మంది విద్యార్థులు, మానకొండూర్ నియోజకవర్గంలో 8,645 మంది, చొప్పదండి నియోజకవర్గంలో 7,481 మంది, కరీంనగర్ నియోజకవర్గంలో 16,355 మంది, మొత్తంగా 49,025 మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజూ అల్పాహారం అందనుంది.