కేంద్ర ప్రాయోజిత పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి
పార్లమెంట్ సభ్యుడు రామ సహాయం రఘురాం రెడ్డి
10 వేల ఇందిరమ్మ ఇళ్లకు స్లాబింగ్ పూర్తి
ఖమ్మం జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎంపీ
ఖమ్మం టౌన్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ప్రజలకు లబ్ది చేకూరేలా కేంద్ర ప్రాయోజిత పథకాలను జిల్లాలో పూర్తి స్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలనీ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో పార్లమెంట్ సభ్యులు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, రాందాస్ నాయక్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ లతో కలిసి పాల్గొన్నారు.
దిశ సమావేశంలో ప్రస్తుతం వారి శాఖల పరిధిలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై జిల్లా సంక్షేమ అధికారి, జీఏం పరిశ్రమలు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, మున్సిపల్ కమీషనర్ లు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, పీ.డీ జాతీయ రహదారులు, పి.డి. హౌసింగ్, విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ అధికారులు నివేదికలు వివరించారు. ఎం పి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా వచ్చిన వికసిత్ భారత్ జి రామ్ జి పథకం మార్గదర్శకాలు ప్రతి ప్రజా ప్రతినిధికి అందేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను రెగ్యులర్ గా మానిటర్ చేయాలని అన్నారు.
జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నడిచే వివిధ వైద్య సేవలలో ఉన్న ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీకి చర్యలు తీసుకోవాలని, ఖమ్మం ఆసుపత్రి మరమ్మత్తు, క్రిటికల్ కేర్ బ్లాక్, ఇతర మౌళిక వసతుల పనుల పురోగతి వివరాలు అందించాలని అన్నారు. జిల్లాలో ప్రైవెట్ ఆసుపత్రిలో అధికంగా సి సెక్షన్ ఆపరేషన్స్ జరుగుతున్నాయని, దీని పై కలెక్టర్ రివ్యూ నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సి.ఈ.ఓ. దీక్షా రైనా, మున్సిపల్ చైర్ పర్సన్లు, సర్పంచులు, జిల్లా అధికారులు, దిశ కమిటీ సభ్యులు, మునిసిపల్ కమీషనర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.




