బద్వేలులో సెంచరీప్లై రూ.1000 కోట్ల పెట్టుబడి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బద్వేలులో సెంచరీప్లై (ఇండియా) లిమిటెడ్ రూ. 1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడి పెట్టింది. తమ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంతో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంది. కోల్‌కతాలో 'ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్' (ఐసిసి) నిర్వహించిన కార్యక్రమంలో ఈ సంస్థ అత్యంత కీలక భూమిక పోషించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్గధామంగా నిలుస్తుందని భరోసా అందించారు. వేగం , స్థిరత్వం , సేవలను రాష్ట్రానికి సంబంధించిన మూడు ముఖ్యమైన అంశాలుగా మంత్రి పేర్కొన్నారు. బెంగాల్ పెట్టుబడిదారులకు సాదర స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్ భారతదేశంలో జరిగే ప్రతి 100 రూపాయల పెట్టుబడిలో 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తున్నాయని వివరించారు. ,ఒకసారి తమ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాక, అది కేవలం మీ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, అది తమ రాష్ట్ర ప్రాజెక్ట్ కూడా అవుతుందని తెలిపారు.
వ్యాపారవేత్తలకు సహాయం చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా అందించారు. ప్రస్తుతం 220 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఆంధ్రప్రదేశ్, భవిష్యత్తులో 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ తమ ఈ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాల్సిందిగా పారిశ్రామిక వేత్తలను కోరారు.
ఐసిసి ఉపాధ్యక్షులు , సెంచరీ ప్లైబోర్డ్స్ (ఇండియా) లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ కేశవ్ భజంకా మాట్లాడుతూ నారా లోకేష్ ముందుచూపు , వ్యూహాత్మక ఆలోచనా విధానం అద్భుతమైనవి , సాటిలేనివని కొనియాడారు. రెండు నెలల క్రితం తాము సమావేశమైనప్పుడు బెంగాల్ నుండి పెట్టుబడిదారులను ఆకర్షించే అవకాశాలపై చర్చించామని చెబుతూ ఈ రోజు ఇలా పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయనతో కలిసి ఉండటం అదృష్టం, గౌరవంగా భావిస్తున్నామన్నారు. స్టాన్‌ఫోర్డ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత దేశ నిర్మాణానికి తనను తాను అంకితం చేసుకున్న లోకేష్ వంటి గొప్ప వ్యక్తిని చూడటం సంతోషంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ బ్రాండ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నామన్నామన్నారు. సెంచరీ ప్లైబోర్డ్స్ 2024లో బద్వేల్ ప్లాంట్ నుండి మీడియం డెన్సిటీ ఫైబర్‌బోర్డ్ (ఎండిఎఫ్) వాణిజ్య సరఫరాను కూడా ప్రారంభించింది.
బద్వేల్ ప్లాంట్ ప్రారంభం తర్వాత, ఈ బ్రాండ్ తన ఎండిఎఫ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 900 నుండి 1900 క్యూబిక్ మీటర్లకు పెంచింది. సెంచరీప్లై యొక్క బద్వేల్ యూనిట్ సుమారు 2,200 మందికి ఉపాధి కల్పించింది. అంతేకాకుండా, కంపెనీకి అవసరమైన ముడి సరుకును బద్వేల్ ప్రాంతంలోని రైతుల నుండి నేరుగా కొనుగోలు చేస్తోంది. భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి, రాబోయే 8 ఏళ్లలో 80,000 ఎకరాలలో ప్లైవుడ్ తయారీకి ఉపయోగపడే చెట్లను నాటాలని రైతులను ప్రోత్సహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, ఇప్పటికే 1,000 మంది రైతులు రాయితీ ధరతో 5,000 ఎకరాలలో చెట్లను నాటడానికి ముందుకు వచ్చారు.






