28 August, 2026 | 4:33 AM

ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి

23-06-2026 09:28 PM

గుండారం ప్రభుత్వ పాఠశాలలో ప్రజా ప్రతినిధుల పిలుపు

కమాన్‌పూర్,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రజా ప్రతినిధులు, నాయకులు చొరవ చూపాలని ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, ఎస్సై కొట్టే ప్రసాద్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంగు సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. కమాన్‌పూర్ మండలం గుండారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విశిష్టతను చాటిచెప్పేలా సీనియర్ జర్నలిస్టు జబ్బార్ ఖాన్ రూపొందించిన ప్రత్యేక సిడిని మంగళవారం కళాశాల ఆవరణలో వారు ఆవిష్కరించారు.

ఉపాధ్యాయుల కృషికి ఫలితం

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం అభినందనీయమని అన్నారు. ప్రిన్సిపాల్ కాశీమల్ల సుధాకర్ నాయకత్వంలో ఉపాధ్యాయులు అందిస్తున్న నాణ్యమైన విద్యాబోధనే దీనికి కారణమని కొనియాడారు. 

ఇప్పటికే ఈ విద్యా సంవత్సరంలో 160 మంది కొత్త విద్యార్థులు కళాశాలలో చేరడం విశేషమన్నారు.

ప్రతి గ్రామం నుంచి ప్రోత్సాహం అవసరం

తమ గ్రామాల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించేలా స్థానిక ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని వారు సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో అందుబాటులో ఉన్న వసతులు, విద్యా ప్రమాణాల గురించి తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు.

సీనియర్ జర్నలిస్టు జబ్బార్ ఖాన్‌కు సన్మానం

కళాశాల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ సొంత ఖర్చుతో చక్కని సిడిని రూపొందించిన జర్నలిస్టు జబ్బార్ ఖాన్‌ను ఈ సందర్భంగా అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ సిడికి మేజిక్ రాజా వ్యాఖ్యాతగా, చంద్రపాల్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోహెల్, గుండారం హెచ్ఎం రమణారెడ్డి, స్థానిక వార్డు సభ్యులు, కళాశాల లెక్చరర్లు, సిబ్బంది మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.