వృద్ధ్దురాలి మెడలోంచి చైన్ స్నాచింగ్
అబ్దుల్లాపూర్‌మెట్, జూన్1: కిరాయికి ఇల్లు కావాలంటూ వచ్చి వృద్ధురాలి మెడ లోంచి ఐదు తులాల బంగారం ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటన శనివారం నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మర్రిపల్లిలో చోటుచేసుకుంది. మర్రిపల్లికి చెందిన గడ్డం కౌసల్య(86) తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వృద్ధ్దురాలు వద్దకు వచ్చి కిరాయికి ఇల్లు కావాలని అడిగారు. సమాధానం చెబుతున్న క్రమంలో ఒక దుండగుడు వృద్దురాలి మెడలో ఉన్న బంగారు చైన్ లాగేందుకు ప్రయత్నించాడు.
వద్దు బిడ్డా నన్ను వదిలిపెట్టు అని వృద్ధురాలు వారి కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డప్పటికీ కనికరించలేదు. ఆమెను వెనక్కు నెట్టేసి మెడలోంచి చైన్ లాక్కొని పరారయ్యారు. దుండగులు నెట్టి వేయడంతో వృద్దురాలికి గాయాలయ్యాయి. దుండగులు అక్కడి నుంచి పారిపోతుండగా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. వృద్ధ్దురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






