ప్రమాదకరమైన జిలెటిన్ స్టిక్స్ పట్టివేత
రంగారెడ్డి, జూన్ 1 (విజయక్రాంతి) : నిబంధనలకు విరుద్దంగా వద్ద నిల్వచేసు కొన్న పేలుడు పదార్థాలు జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు చాకచాక్యంగా పట్టుకొని నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు షాద్‌నగర్ ఏసీపీ రంగాస్వామి తెలిపారు. శనివారం షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేలుడు పదార్థాలకు సంబంధించిన విషయాలను ఏసీపీ వెల్లడించారు. ఫరుఖ్‌నగర్ మండలం లోని కమ్మదనం గ్రామానికి చెందిన ఉరుసు నరసింహ, ఈశ్వర్, రాజు, మధుసూదన్ రెడ్డిలు గత కొంత కాలంగా నిబంధనలకు విరుద్దంగా పేలుడు పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా నిల్వ చేస్తున్నారు.0
వీటి విలువ దాదాపు రూ.8 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు షాద్‌నగర్ పోలీసులు, శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు రైడ్ చేసి 490 జిలటిన్‌స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దానితో పాటు కంప్రెషర్ ట్రాక్టర్, నాలుగు స్మార్ట్ ఫోన్లు, ఒక వైర్ కట్టర్, ఎలక్ట్రిక్ సామగ్రిని సీజ్ చేశారు. అత్యంత ప్రమాదకరమైన జిలటిన్ స్టిక్స్‌ను జనావాసాల మధ్య ఏలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచడం చట్టరిత్యా నేరమని పేర్కొన్నారు.
ప్రమాదవశాత్తు జిలెటిన్‌స్టిక్స్ పేలితే ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరుగుతుందని తెలిపారు. కొద్ది రోజుల క్రితం మధుసూదన్‌రెడ్డి నల్గొండకు చెందిన సతీష్ వీటిని భువనగిరిలోని ఐడియల్ ఇండస్ట్రియల్ ఎక్స్‌ప్లోజివ్ లిమిటెడ్ కంపెనీ నుంచి తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసులో ప్రమేయం ఉన్న చిట్యాలకు చెందిన మేనేజర్ నరేందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితులపై 421/2024 క్రింద ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ 1908 కింద కేసు బుక్ చేసినట్లు ఏసీపీ వివరించారు. కేసు విషయంలో చాకచాక్యంగా వ్యవరించి నందుకు షాద్‌నగర్ సీఐ ప్రతాప్‌లింగం, ఎస్‌ఓటి సీఐ సంజయ్‌కుమార్‌లతో పాటు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.






