గ్రామంలో మద్యం అమ్మితే రూ.90 వేల జరిమానా
పట్టిస్తే రూ.10 వేల నగదు బహుమతి
అలంపూర్, జూన్ 17: మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు అలంపూర్ మండలం గుందిమల్ల గ్రామపంచాయతీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తే రూ.90 వేల జరిమానా విధించాలని గ్రామపంచాయతీ తీర్మానించింది.
అంతేకాకుండా గ్రామంలో మద్యం విక్రయాలు చేస్తున్న వారిని రెడ్హ్యాండెడ్గా పట్టించి అధికారులకు సమాచారం అందించిన వారికి రూ.10 వేల నగదు బహుమతి అందజేయాలని నిర్ణయించింది. గ్రామంలో మద్యం కారణంగా కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామాన్ని మద్యరహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామపంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయానికి గ్రామస్తులు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు.






