17 June, 2026 | 3:41 AM

మత్తు రహిత జీవితమే సురక్షితం

17-06-2026 02:25 AM

- పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

బెల్లంపల్లి, జూన్,16: రోడ్డు భద్రత పట్ల బాధ్యతగా వ్యవహరిద్దామనీ, మత్తురహిత జీవనశైలే అలవర్చుకొని ముందుకు వెళ్దామని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అ న్నారు. బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో తాళ్ల గురజాల గ్రామంలో జరిగిన గ్రామసభ, ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీపీ పాల్గొని మాట్లాడారు.

రోడ్డు ్ర పమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ మాట్లాడుతూరాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడడమే తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ, పోలీస్ కమిషనర్ లక్ష్యమని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా, కుటుంబాలు ఇబ్బందులకు గురికాకుండా, శారీరక వైకల్యాలకు లోనుకాకుండా ఉండేందుకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.

మైనర్ డ్రైవింగ్ను ప్రోత్సహించినట్లయితే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆర్మీ,పోలీస్ శాఖల్లో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న పలువురు యువకులు ఉత్సాహంగా నిర్వహించిన పుష్-అప్స్ ప్రదర్శన ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఓ యువకుడిని పోలీస్ కమిషనర్ శాలువాతో సత్కరించి రూ. 500 నగదు బహుమతిని అందజేశారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్, ఎస్‌ఐలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.