రేపటి 'ఆదివాసీ మార్చ్' ను విజయవంతం చేయండి
- తుడుం దెబ్బ మండలాధ్యక్షుడు సూర్ పటేల్
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): 'ఆదివాసీ మార్చ్'(Adivasi March) లో భాగంగా ఈ నెల 16న నిర్వహించనున్న ఛలో ఐటీడీఏ ఉట్నూర్ కు పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలి రావాలని ఆదివాసీ తుడుం దెబ్బ మండలాధ్యక్షుడు జూగునాక సూర్ పటేల్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఛలో ఐటీడీఏ పోస్టర్(Chalo ITDA poster) విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 1/70 గిరిజన చట్టాన్ని రద్దు చేయాలని, లంబాడాలను ఎస్టీ హోదాను నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
పోడు భూముల సమస్య నేటికి పరిష్కారానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. గిరిజన గ్రామాల్లో కనీస మౌళిక సదుపాయాలు కల్పించడం లేదని వాపోయారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. ఎన్నికల సమయంలోనే ఆదివాసీలు దేశానికి మూల వాసులని పొగడటం ఆ తర్వాత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తలమల నుంచి లక్షేట్టిపేటకు రావడానికి రోడ్డు సౌకర్యం సక్రమంగా లేదని, వర్షానికి బురదలో ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ప్రభుత్వం తమ న్యాయమైన హక్కులను నెరవేర్చడం లేదన్నారు.ఆదివాసీలు ఛలో ఐటీడీఏ ఉట్నూర్ ద్వారా ప్రభుత్వానికి తమ గళాన్ని వినిపించాలని కోరారు. ఈ సమావేశంలో తుడుం దెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ బద్ది చిన్నయ్య, ఆదివాసీ విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు మెస్రం చిత్రు, నాయకులు బద్ది ధర్మయ్య, జూగునాక జగన్, బద్ది చంటి, కుర్సెంగా విజయ్ కుమార్, పూసం సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.