జూన్ 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ఎక్కడంటే..!
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందిన విషయం తెలిసిందే, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ప్రమాణ స్వీకరానికి వేదిక, ముహూర్తం ఖరారు అయింది. జూన్ 12వ తేదీన ఉదయం 11:27 ని.లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
అందుకోసం అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. టీడీపీ నేతలు ముందుగా మంగళగిరి ఎయిమ్స్ వద్ద స్థలాన్ని పరిశీలించినప్పటికి అక్కడ అనువుగా లేకపోవడంతో గన్నవరం స్థలాన్ని ఖరారు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.






