29 July, 2026 | 2:34 AM

చార్‌ధామ్ యాత్ర నిలిపివేత

29-07-2026 01:33 AM
  1. విరిగిపడుతున్న కొండచర్యలు
  2. రెండు రోజుల ఆరెంజ్ అలర్ట్ జారీ 

డెహ్రాడూన్, జూలై 28: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలతో వరదలు తలెత్తి చార్‌ధామ్ (కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి) యాత్రల మార్గంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రెండు రోజులపాటు యాత్రను నిలిపివేస్తున్నట్లు మంగళవారం అధికారులు ప్రకటించారు. మంగళ, బుధవారాల్లో యాత్రను పూర్తిగా నిలిపివేశామని, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని గర్‌వాల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ తెలిపారు.

పరిస్థితులు మెరుగుపడి, రహదారులు పునరుద్ధరించిన తరువాత యాత్రను పునఃప్రారంభిస్తామన్నారు. అప్పటివరకు భక్తులు యాత్రను వాయిదావేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన నదులలో నీటిమట్టం భారీగా పెరిగింది. కొండప్రాంతాల్లోని పలు ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడుతుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రహదారులను పునరుద్ధరించేందుకు, ప్రమాదకర ప్రాంతాల్లో విపత్తు సహాయక, రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేసింది. మరో రెండు రోజులపాటు ఉత్తరకాశీ, డెహ్రాడూన్, తెహ్రీ, రుద్రప్రయాగ్, చమోలీ, ఉధమ్ సింగ్ నగర్, బాగేశ్వర్, పిథోరగఢ్, నైనిటాల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉ రుములు, మెరుపులు సంభవిస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.