5 August, 2026 | 1:53 AM

గచ్చిబౌలిలో చార్మినార్ సెట్!

05-08-2026 12:00 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక సినిమాల్లో ‘ఫౌజీ’ ఒకటి. పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజాగా ఓ వార్త అభిమానును మరింత ఉత్సాహపరుస్తోంది.

ఈ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో చార్మినార్ సెట్ నిర్మిస్తున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా చార్మినార్ నేపథ్యంలో సన్నివేశాలు చిత్రీకరించాలంటే ఏ మూవీ మేకర్స్ అయినా పాతబస్తీ ప్రాంతాన్నే ఎంచుకుంటారు. అయితే ‘ఫౌజీ’ బృందం మాత్రం అందుకు భిన్నంగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది.

గచ్చిబౌలి ప్రధాన రహదారిలోని పాత అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణంలో భారీ సెట్‌ను ప్రత్యేకంగా నిర్మిస్తోంది. నిజమైన కట్టడాన్ని పోలి ఉండేలా అత్యంత నైపుణ్యంతో ఈ సెట్‌ను రూపొందిస్తున్నారని టాక్. ప్రభాస్‌కున్న అపారమైన అభిమానగణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్. పాతబస్తీలో షూటింగ్ నిర్వహిస్తే వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకునే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు, భద్రతా ఇబ్బందులు తలెత్తే అవకాశముందని చిత్రబృందం భావించిందట.

షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేందుకు ప్రత్యేకంగా ఈ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారని తెలిసింది. పరిశ్రమ వర్గాల ద్వారా అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఆగస్టు 3 నుంచి ప్రారంభమైన ఈ షెడ్యూల్ దాదాపు 25 రోజుల పాటు కొనసాగనుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ కీలక సన్నివేశాల్లో పాల్గొననున్నారు.

ఈ షెడ్యూల్ పూర్తయితే సినిమా చిత్రీకరణ దాదాపు 90 శాతం ముగిసినట్టే. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయనున్నారనట మేకర్స్. దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి టాలీవుడ్‌కు కథానాయికగా పరిచయమవుతోంది. అనుపమ్‌ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 3న రిలీజ్ కానుందీ చిత్రం.