ఆత్మీయులతో మాటా ముచ్చట
ఊరుకొండపేట అంజన్న సన్నిధిలో సీఎం రేవంత్ పూజలు
నాగర్‌కర్నూల్/ఊర్కొండ, జూలై 4 (విజయక్రాంతి): 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన తన రాజకీయ ప్రస్థానంలో జడ్పీటీసీగా గెలుపొందడం కోసం సహకరించి నేడు అత్యంత గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థాయికి అందలమెక్కించేందుకు ప్రత్యక్ష పరోక్షంగా సహకరించిన తన ఆత్మీయులను, పెద్దలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మీయంగా పలకరించారు. మిడ్జిల్ మండలం ఆయా గ్రామాల్లోని ఏడుగురు చొప్పున 80 టేబుల్లను ఏర్పాటు చేసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి ఒక్కో టేబుల్ వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు.
నాడు తనతో పాటు రాజకీయంగా పనిచేసిన వారితో అభిమానులతో నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కాసేపు ముచ్చటించారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ పేట ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఆలయ పాలక మండలి సభ్యులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వారితో పాటు ఎమ్మెల్యేలు, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుల్ల రాజేష్ రెడ్డి, ఆలయ చైర్మన్ మనోహర్ రెడ్డి, సర్పంచ్ రషీద్, కాంగ్రెస్ నాయకులు ధ్యాప నిఖిల్ రెడ్డి, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.






