అంకెలపై రంకెలు
- మీ ప్రభుత్వంలో తెచ్చిన రూ.15 వేల కోట్లు కూడా మా ఖాతాలోకేనా..
- రాష్ట్రానికి ఉన్న అప్పు రూ. 4.17 లక్షల కోట్లు మాత్రమే..
- స్కాంల నుంచి డైవర్షన్ చేయడానికే ఈ డ్రామాలు
- లంచాలు ఇచ్చి అప్పులు తేవడం సిగ్గుచేటు
- అసెంబ్లీ పెట్టండి.. చర్చిద్దాం: హరీష్‌రావు
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): అప్పుల విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అబద్దాలు, అర్ధసత్యాలు చెప్పి మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేశారని, రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవని మాజీమంత్రి హరీష్‌రావు విమర్శిం చారు. అన్నీ తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని, లేని అప్పులను ఉన్నట్లుగా చూపి గోబెల్స్ ప్రచారానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇటీవల హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టి అప్పుల విషయంలో అర్ధరహితంగా మాట్లాడారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ఎఫ్‌ఆర్‌బీఎం, ఎస్‌పీవీ గ్యారంటీ రుణా లు మొత్తం కలిపి రూ.84,268 కోట్లు, 2023 డిసెంబర్ 7 నుంచి 2024 మార్చి 31 వరకు అంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు రూ.15,118 కోట్లు.. మొత్తం కలిపి రూ. 99,386 కోట్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వ అప్పుల్లో కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2023 డిసెంబర్7 నాటికి ప్రభుత్వంపై ఉన్న మొత్తం బకాయి రుణాలు రూ.5,16,881 కోట్ల నుంచి తీసివేస్తే రాష్ట్రానికి ఉన్న అప్పు కేవలం రూ.4,17,495 కోట్లు మాత్రమేనని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కార్పొరేషన్ రుణాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదన్నారు. అప్పుల విషయంలో మంత్రి జూపల్లి సవాల్ చేసి తోక ముడిచిన తీరును యావత్ తెలంగాణ సమాజం చూసిందని, ఆ అవమానం నుంచి ఎలాగైనా బయటపడాలనే భావనతో, ఆత్మరక్షణలో భాగంగా అప్పులపై ‘భట్టి’ తప్పుడు లెక్కలు వండి వార్చారని మండిపడ్డారు.
మేం అప్పుల విషయంలో స్పష్టంగా ఉన్నామని, మీ లాగా పూటకో మాట, ఇష్టం ఉన్నట్లు లెక్కలు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోనైనా, బహిరంగ సమావేశాల్లోనైనా, ప్రెస్‌మీట్‌లోనైనా మాది ఒకటే మాట అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆదాయవనరులు సమకూర్చుకోవడంలో అపారమైన అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీకి అది పెద్ద సమస్య కాదన్న భట్టి.. హామీలు ఎందుకు అమలు చేయడం లేదు.. మీ అపారమైన అనుభవం ఏమైందని ప్రశ్నించారు.
కరోనా వచ్చినా, ఎకానమీ డౌన్ అయినా.. కేసీఆర్ ఏనాడూ రాష్ట్రాన్ని దివాళా తీయించలేదని గుర్తు చేశారు. మరి ఇప్పుడు కరోనా, పెద్ద నోట్ల రద్దు లేకున్నా.. మీ సీఎం ఎందుకు దివాళా దివాళా అని మాట్లాడుతున్నరు?, నన్నెవరూ నమ్ముతలేరు, అప్పు పుడతలేదు.. అపాయింట్‌మెంట్ దొరకట్లేదు. దొంగను చూసినట్టు చూస్తున్నారు.. అని ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారని అని ప్రశ్నించారు. మీ అపారమైన అనుభవం కమీషన్లు దండుకోవడానికి తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడలేదన్నారు.
చర్చకు మేం సిద్ధం
ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఉండి కూడా చూసుకోకుండా ఎవరో తయారు చేసిన నోట్ చదివి, ఆ విధంగా అబద్దాలు మాట్లాడొచ్చ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హరీశ్‌రావు ప్రశ్నించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 8,21,651 కోట్లు అని అదే కట్టు కథ చెప్పారని మండిపడ్డారు. ఎన్ని కలిపినా వాళ్లు చెప్పిన రూ.8,21,651 కోట్లు నిండటం లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పుల గురించి కాగ్ రిపోర్టు కుండబద్దలు కొట్టినట్లు చెప్పిందన్నారు.
2024 మార్చి నాటికి ప్రభుత్వమే చెల్లించే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూ.1,20,944 కోట్లు కాగా, ఇందులో భట్టి చెప్పిన డాక్యుమెంట్‌లో 2014 జూన్ 2 నాటికి ప్రభుత్వం చెల్లించే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూ.11,609 కోట్లు తీస్తే రూ.1,09,335 కోట్లు ఉంటుందని వివరించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం, సీతారామ, స్కీములకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల రూ.4,10,819 కోట్లు అని కాగ్ స్పష్టం చేసిందని వెల్లడించారు.
అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో సంబంధం లేనివి కలిపి అప్పు రూ.6,71,757 కోట్లు అని చెప్పారని పేర్కొన్నారు. మీరు ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మరలించడం కోసం, మీ స్కామ్‌ల నుంచి డైవర్షన్ చేసేందుకు అప్పుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భట్టి విక్రమార్క రూ. లక్ష 77 వేల కోట్ల అప్పు తెచ్చినం అంటారు.. 2026 మార్చి 18న అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎఫ్‌ఆర్‌బీఎంతో పాటు, అన్ని రకాల అప్పులు, 2026 ఫిబ్రవరి 28 నాటికి అన్ని కలిపి రూ.3,47,294 కోట్లు అని స్వయంగా ప్రకటించారని.. నాలుగు నెల్లలో అప్పు ఎట్ల తగ్గిందని ప్రశ్నించారు. జూన్ 30 నాటికి పబ్లిక్ డొమైన్ ఉన్న లెక్కల ప్రకారం, 31 నెలల్లో రేవంత్ రెడ్డి చేసిన మొత్తం అప్పు 4.50 లక్షల కోట్లు అని తెలిపారు.
లంచాలు ఇచ్చి అప్పులు తెస్తున్నరు
ప్రభుత్వమే అప్పుల కోసం బ్రోకర్లకు లంచాలు ఇచ్చే పరిస్థితికి దిగజారిందని, అందుకే రేవంత్‌రెడ్డిని ప్రజలు దొంగలా చూస్తున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. టీజీఐఐసీ భూములను కుదువపెట్టి రూ.10వేల కోట్ల అప్పు తేవడానికి బ్రోకరేజ్ చార్జీ రూ.170 కోట్లు చెల్లించారని, మొత్తం రూ.30 వేల కోట్లకు గాను అక్షరాల రూ. 510 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. దీన్ని బ్రోకరేజ్ అంటరా? లంచం అంటరా? ఏమంటరో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు.
ఈ విధంగానే మూడు హైదరాబాద్ కార్పొరేషన్లు, డిస్కంలు, హెచ్‌ఎండబ్ల్యూఎస్ ద్వారా మరో రూ.70,000 కోట్ల అప్పు తేవాలని టార్గెట్ పెట్టుకున్నారని, దీనికోసం రేవంత్‌రెడ్డి బ్రోకర్లకు ఇచ్చే లంచం రూ.1,200 కోట్లు అని ఆరోపించారు. బాండ్ల ముసుగులో ఇదంతా చేస్తున్నారని, బొందల గడ్డకు కూడా జాగ లేకుండా ఖతం పట్టిస్తున్నారని మండిపడ్డారు.
రూ.4.17లక్షల కోట్లతో ఇవి చేశాం
మేము తీసుకొచ్చిన రూ. 4.17 లక్షల కోట్లతో కాళేశ్వరం, మిషన్ భగీరథ, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క సాగర్, రైతుబంధుకు రూ.72,972 కోట్లు, రైతు బీమాకు రూ.6,800 కోట్లు, రైతు రుణమాఫీ రూ. 29 వేల కోట్లు, ఉచిత కరెంట్‌కు రూ. 61 వేల కోట్లు, గొర్రెల పంపిణీకి రూ.5 వేల కోట్లు, మీరు కూర్చుంటున్న సచివాలయం, పటిష్టమైన భద్రత కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ, జిల్లాకు ఒక కలెక్టరేట్ కట్టామని హరీశ్‌రావు వివరించారు.
బొగ్గు మాయంపై సింగరేణి విజిలెన్స్ విచారణ చేయిస్తామని భట్టి అనడం.. దొంగకే తనకు తానుగా విచారణ చేసుకోమని చెప్పినట్లుందని ఎద్దేవా చేశారు. రూ.వెయ్యి కోట్ల సోలార్ పవర్ స్కాం, పాకిస్థాన్ బార్డర్ జైసల్మేర్‌లో సోలార్ ప్లాంట్ స్కాం గురించి, సింగరేణిలో ఎక్స్ ప్లోసివ్ స్కాం, డీజిల్ స్కాం, జైపూర్ పవర్ ప్లాంట్, ఎక్స్ ప్లోజివ్స్ కుంభకోణాల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. చేతనైతే పాలన మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు.






