సీపీఎస్‌పై పోరు
2.6 లక్షల మంది ఉద్యోగులు ఆందోళనకు సిద్ధం
- సర్కార్‌పై ఒత్తిడికి ఉద్యమ కార్యాచరణ
- 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జనజాగరణ యాత్ర
- మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాసంఘాలకు వినతులు
- ఆగస్ట్ 23న హైదరాబాద్‌లో లక్ష మందితో సభ
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులు పోరు బాటకు సిద్ధమవుతున్నారు. పాత పెన్షన్ (ఓపీఎస్) సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.6 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏకమవుతున్నారు. ఇందుకోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త జనజాగరణ యాత్రతో పాటు భారీ సభ ఏర్పాటుకు నిర్ణయించారు. ప్రతి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ జేఏసీ నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
భవిష్యత్తుకు లేని భరోసా..
సీపీఎస్ ఉద్యోగుల ఆవేదన అంతా ఇంతా కాదు. భవిష్యత్తుకు భరోసా లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత పెన్షన్‌ను ఎత్తివేసి 2004 నుంచి సీపీఎస్‌ను అమల్లోకి తెచ్చారు. 2004 సెప్టెంబర్ 1 నుంచి నియమాకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు సీపీఎస్ పరిధిలోకి వస్తారు. రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మొత్తం కలిపి దాదాపు 2.60 లక్షల మంది వరకు ఉంటారు. వీరికి ఓపీఎస్ పెన్షన్ వర్తించకపోవడంతో సామాజిక, ఆరోగ్య భరోసా ఉండడంలేదని వాపోతున్నారు.
ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తూ, దాదాపు 30 సంవత్సరాల పాటు ప్రజలకు, ప్రభుత్వానికి నిరంతర సేవలు అందిస్తున్న వీరు రిటైర్డ్ అయిన తర్వాత వృద్ధాప్యంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవితాంతం కష్టపడి వృద్ధాప్య దశకు చేరుకున్న తరుణంలో కనీస జీవన భృతి లేకపోవడం, అరకొర పెన్షన్‌తో వైద్య ఖర్చులకు కూడా సరిపోని దయనీయ పరిస్థితుల్లో వారు జీవనం సాగిస్తున్నారు. ఓపీఎస్ అమలు చేస్తే ఆ ఉద్యోగి రిటైరయ్యే నెలలోని వేతనంలో సగం వేతనం పెన్షన్‌గా వస్తుంది.
అలాగే ఓ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు 30 శాతం పెన్షన్ వస్తుంది. అదే సీపీఎస్ అమలు ద్వారా ఇవేవీ ఉండవు. పైగా పెన్షన్ చాలా తక్కువగా వస్తుంది. ప్రస్తుతం చాలా మందికి పది వేల లోపే పెన్షన్ వస్తుంది. ఉద్యోగంలో ఉన్నంత కాలం మాత్రమే హెల్త్ కార్డు వర్తిస్తుంది.
విరమణ పొందిన మరుక్షణం నుంచి ఆ ఉద్యోగికి, కుటుంబ సభ్యులకు అది వర్తించదు. ఈ దయనీయమైన ఆర్థిక, ఆరోగ్య పరిస్థితిని, ఉద్యోగుల ఆవేదనను జనజాగరణ యాత్ర ద్వారా ప్రత్యక్షంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. పక్క రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసిన ఆయా ప్రభుత్వాలు తెలంగాణలో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నిస్తున్నారు.
33 జిల్లాల్లో యాత్ర..
పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్‌ఈయూ) ఆధ్వర్యంలో భారీ ఉద్యమానికి తెరలేపింది. ఇందులో భాగంగా ఈనెల 11న భద్రాచలం వేదికగా ఫేజ్d జనజాగరణ యాత్రను ప్రారంభించనున్నారు. మొదటి ఫేజ్‌లో 30 జిల్లాల్లో యాత్ర కొనసాగనుంది. జూలై 11న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ప్రారంభమయ్యే జనజాగరణ యాత్ర, జూలై 31 వరకు రాష్ట్రంలోని 30 జిల్లాల్లో నియోజకవర్గాల మీదుగా కొనసాగనుంది.
ఫేజ్‌ౠ ఆగస్టు 3 నుంచి 18 వరకు మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా ఆయా జిల్లాల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయ, ఉద్యోగుల జేఏసీ, ప్రజా సంఘాల ప్రతినిధులు మద్దతుకోరడంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోరానున్నారు. అనంతరం ఆగస్టు 23న లక్ష మంది ఉద్యోగ, ఉపాధ్యాయులతో ‘చలో హైదరాబాద్’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
హామీని నెరవేర్చమంటున్నాం..
ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చమంటున్నాం. రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సీపీఎస్‌ను రద్దు చేశారు. పంజాబ్‌లోనూ రద్దు చేశారు. కర్ణాటకలో సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మరీ తెలంగాణలో ఎందుకు చేయడం లేదు. ఈ యాత్రలో ప్రతి సీపీఎస్ ఉద్యోగి, ఉపాధ్యాయుడిని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా కలిసి సీపీఎస్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తాం. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల ఆవేదనను చేరవేస్తాం.
స్థితప్రజ్ఞ,
సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
సామాజిక భద్రత కల్పించాలి
ఉద్యోగుల సామాజిక భద్రతను ప్రభుత్వం బాధ్యతగా గుర్తించాలి. సీపీఎస్ రద్దు ఓపీఎస్ పునరుద్ధరణ అనే ఏకైక లక్ష్యంతో ఈ జనజాగరణ యాత్ర కొనసాగనుంది. ఈ మహాయాత్రకు ముగింపుగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. రాష్ట్ర నలుమూలల నుంచి లక్ష మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు హైదరాబాద్‌కు తరలివచ్చి ప్రభుత్వాన్ని మరోసారి గట్టిగా డిమాండ్ చేస్తాం. సీపీఎస్ అమలు చేయడం ద్వారా షేర్ మార్కెట్ ఒడిదుడుకులను బట్టి తమకు పెన్షన్ వర్తిస్తుంది. ఇలా చేస్తే ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా చాలా నష్టం.
కల్వల్ శ్రీకాంత్,
సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి






