5 July, 2026 | 2:40 AM

హిందువులపై కుట్ర

05-07-2026 01:12 AM

సర్ పేరుతో ఓట్లను తొలగించే పన్నాగం 

మజ్లిస్‌తో కుమ్కక్కైన కాంగ్రెస్ తెలంగాణను శ్రీలంక, పాకిస్థాన్‌లా మార్చే ప్రమాదం

కేంద్రమంత్రి బండి సంజయ్

వేములవాడ/కోరుట్ల, జూలై 4 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ‘సర్’ను ఉపయోగించు కుని హిందువుల ఓట్లను తొలగించేందుకు పెద్దఎ త్తున కుట్ర చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు సహక రించడం లేదన్నారు.

ఫలితంగా అధికారులు క్షేత్రస్థాయిలో హిందువుల ఇండ్లకు పూర్తిస్థాయిలో వెళ్లడం లేదని, తెలంగాణలోని హిందువులంతా జాగృతం కావాలని, లేనిపక్షంలో తెలంగాణలో హిందువులంతా మైనారిటీలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శనివారం వేములవాడ నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను బండి సంజయ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో 8 లక్షల 21 వేల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్ రెండున్నరేళ్లలో లక్షా 77 వేల కోట్లు అప్పు చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రే చెప్పారంటూ పేర్కొన్నారు. రెండు పార్టీలు కలిసి 10 లక్షల అప్పు చేసి జనంపై భారం మోపాయన్నారు. తెలంగాణను శ్రీలంక, పాకిస్థాన్‌లా మార్చే ప్రమాదం ఏర్పడిందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం 14, 15 ఆర్ధిక సంఘం నిధులిస్తే, జీతాలిస్తూ డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రం అప్పుల ఊబి నుంచి బయటకు రావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనని, బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో అప్పుల బాధ ఉండదు, అవినీతి జరగదు, అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వీబీజీ రామ్ జీ పథకంతో పనిదినాలు పెంచి ఆస్తులు సృష్టిస్తే దీనిపై కోర్టుకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. కష్టపడి పనిచేసి క్షేత్రస్థాయి నుండి ఎదిగే లీడర్ ను సమాజం గౌరవిస్తుందని, అందులో భాగంగా 20 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.

గత 7 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 22 వేల కోట్లకుపైగా కేంద్ర నిధులు తీసుకొస్తే, అందులో  రోడ్ల నిర్మాణం కోసమే 10 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేశామన్నారు. వేములవాడ నియోజకవర్గంలోనే ఇటీవల మల్యాల నుంచి కాచారం వరకు, సిరికొండ నుంచి వేములవాడ వరకు 20 కోట్లతో, మేడపల్లి నుంచి గోవిందారం వరకు 25 కోట్లతో, సిరికొండ నుంచి వేములవాడ వరకు 23 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించామని తెలిపారు.

కేవలం జాతీయ రహదారుల విస్తరణ కోసమే 5 వేల  కోట్ల రూపాయలు తీసుకువచ్చామన్నారు. 2,147 కోట్లు నిధులతో కరీంనగర్--వరంగల్ నేషనల్ హైవే పనులను పూర్తి చేసుకుని దసరా నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని తెలిపారు. అలాగే 578 కోట్ల రూపాయలతో ఎల్కతురి-సిద్దిపేట నేషనల్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.

ఈ ప్రాంత చిరకాల వాంఛ అయిన కరీంనగర్--జగిత్యాల హైవే విస్తరణ పనులను ప్రారంభించుకోబోతున్నామని, 2,003 కోట్లకుపైగా నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఎన్నికల తరువాత నా ధ్యాస, శ్వాస అంతా అభివృద్ధి మీదనే అని చెప్పారు.