సౌత్‌శక్తిగా సింగరేణి ఎదగాలి
- దక్షిణాది ఇంధన భద్రతలో కీలకపాత్ర పోషించాలి
- 10-15 ఏళ్ల దీర్ఘకాలిక కార్యాచరణతో ముందుకు సాగాలి
- బొగ్గు గనుల వేలంలో కొత్త బ్లాకులు సాధించాలి
- సింగరేణి వాస్తవ పరిస్థితులను కార్మికులకు పారదర్శకంగా వివరించాలి
- భవిష్యత్ సవాళ్లు, సంస్కరణల కోసం ప్రత్యేక కమిటీ
- కోల్ గ్యాసిఫికేషన్‌లోనూ అడుగులు వేయాలి
- ఉత్పత్తితో పాటు సంస్థ దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి సారించాలి
- సింగరేణిపై ప్రత్యేక సమీక్షలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలో ఏకైక ప్రధాన బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉన్న సింగరేణి దక్షిణాది ఇంధన శక్తిగా ఎదగాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రానున్న రోజుల్లో తన సేవలను మరింత విస్తృత పరచాలని, కొ త్త గనులు సాధించి పెరుగుతున్న దేశ ఇంధన అవసరాలకు తోడ్పాటును అందించాలన్నారు. భవిష్యత్ సవాళ్లు, సమస్కరణల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
కోల్ గ్యాసిఫికేషన్‌లోనూ సరికొత్త అడుగులు వేయాలని, ఉత్పత్తి పెంపుతో పాటు సంస్థ దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి సారించాలన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సింగరేణి సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి సింగరేణి గనుల ఉత్పత్తి, రవాణా, కొత్త గనులు వాటి ఉత్పత్తి వివరాలు, అనుమతుల స్థితిగతులపై గనుల వారీగా క్షుణ్ణంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి పెంచడం కోసం అవసరమైన కొత్త బ్లాక్లను బొగ్గు శాఖ నిర్వహించే వేలం పాటలో పాల్గొని సాధించాలని పేర్కొన్నారు. దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 10 నుంచి 15 సంవత్సరాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.
దేశ ఇంధన రంగంలో ఇంకా సుదీర్ఘ కాలం బొగ్గు కీలక పాత్ర పోషించనున్నదని, కనుక బొగ్గు ఉత్పత్తిని గణనీయం గా పెంచడంపై దృష్టి సారించాలని, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ, పని సామర్థ్యాన్ని మరింతగా పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు.
సంస్థ వాణిజ్యపరమైన విజయాలకే పరిమితం కాకుండా దేశ భవిష్యత్ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగాలని తెలిపారు. కంపెనీ అభివృద్ధికి, సంస్కరణల అమలుకు ఒక ప్రత్యేక కమిటీని నియమించుకోవాలన్నారు. సంస్థ అభివృద్ధికి తాము పూర్తి సహకారం అందిస్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
గ్యాసిఫికేషన్‌పై దృష్టి సారించాలి
దేశంలో కోల్ గ్యాసిఫికేషన్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ భారత దేశంలో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థగా ప్రారంభ దశలో చిన్న స్థాయిలో అయినా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు చేపట్టడంపై దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఫెర్టిలైజర్స్ తదితర పరిశ్రమలను దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవటానికి కోల్ గ్యాసిఫికేషన్‌కు పూనుకోవాలన్నారు.
ఎల్‌నినోకు ముందస్తు ప్రణాళిక
దేశంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో వ్యవసాయ, ఇతర పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ వినియోగం తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. విద్యుత్ ఉత్పాద నకు తగినంత బొగ్గు అందించడానికి కోలిండియా తోపాటు సింగరేణి కూడా సంసిద్ధంగా ఉండాలనిపేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను ముందుగానే బలోపేతం చేసి విద్యుత్ ఉత్పత్తికి నిరంతర ఇంధన సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
బొగ్గు ఉత్పత్తి పెంపునకు అనుగుణంగా రవాణా వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. రవాణా కాంట్రా క్టులను వేగంగా ఖరారు చేయాలన్నారు. సింగ రేణి అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సంస్థ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో ఉద్యోగులను భాగస్వాములు చేసి, వారి విశ్వాసాన్ని మరింత పెంపొందించాలన్నారు. ప్రతీ ఉద్యోగి సంస్థ విజయాన్ని తన విజయంగా భావించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.






