విత్తనశుద్ధితో చీడపీడలకు చెక్
వరంగల్, జూన్ 7(విజయక్రాంతి): విత్తనాలను శుద్ధి చేయడం ద్వారా మొక్కలను ఆశించే చీడపీడల నుంచి రక్షించుకోవచ్చు. విత్తనాల ద్వారా వ్యాపించే వివిధ రకాల వ్యా ధులను, వ్యాధికారిక కీటకాల నుంచి పంటలను కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మొలకెత్తే విత్తనాలు, లేత మొలకలతో నేల ద్వారా వ్యా పించే తెగుళ్ల వ్యాప్తిని నియంత్రించవచ్చు. విత్తనాలలో అంకురోత్పత్తి మెరుగు పడుతుంది. ఆరు నెలల వరకు వ్యాపించే వేరుకుళ్లు నుంచి మొక్కలను రక్షణ కల్పిస్తుంది. పంట మొదటి దశలో రసం పీల్చే పురుగులు, వేరు పురుగుల నుంచి రక్షణ ఉంటుం ది. తొలిదశలో రసాయన పురుగు మందుల పిచికారికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో మూడు రకాలుగా చేసే విత్తన శుద్దితో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
సీడ్ డ్రెస్సింగ్
ఇది విత్తన శుద్ధికి సంబంధించిన సాధారణ పద్దతి. ఇందులో రసాయన పొడిని ద్రవంగా మార్చి తడిగా ఉన్నప్పుడు విత్తనానికి పట్టించాలి. తక్కువ ఖర్చుతో కూడిన మట్టి కుండలు, పాలిథిన్ షీట్లలో విత్తనాలను కలపవచ్చు. ఇంటి దగ్గర వీలు కాకుంటే పొలం దగ్గర కూడా చేసుకోవచ్చు.
విత్తన పెల్లెడింగ్
ఇది అత్యంత అధునాతనమైన విత్తన శుద్ధి పద్దతి. దీంతో విత్తనం భౌతిక ఆకృతి మారుతుంది. పెల్లెటింగ్‌కు ప్రత్యేకమైన మిషనరీ, టెక్నిక్‌లు అవసరముంటాయి. ఖరీదైన విత్తన శుద్ధి పద్దతి కాబట్టి కంపెనీలలో ఉపయోగిస్తారు.
పంటలు.. విత్తనశుద్ధి రసాయనాల వాడకం
1. చెరుకు: విత్తనశుద్ధి ద్వారా వేరు తెగులు, ఎండు తెగులు వ్యాప్తిని తగ్గిస్తుంది. చెరుకు గడలకు కార్బండిజం, ట్రైకోడెర్మా లాంటి మందులు వాడుకోవాలి.
2. వరి: పంటలో వేరుకుళ్లు వ్యాధిని తగ్గించడానికి విత్తనాలకు ట్రైకోడెర్మా, క్లోరోపై రిఫాస్, సూడోమోనాస్, ఫ్లోరోసెన్స్ వాడాలి. పురుగులను తగ్గించడానికి మోనోక్రోటోఫాస్ ద్రావణంలో విత్తనాలను 6 గంటలు నానబెట్టాలి.
3. మిరప: మిరప విత్తనాలకు ఆంత్రాక్సోస్, డంపింగ్ ఆఫ్ ద్వారా వచ్చే వ్యాధిని తగ్గించడానికి ట్రైకోడెర్మా విరిడి, కార్బండిజం మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. నేల ద్వారా సంక్రమించే శిలీంధ్ర వ్యాధులను తగ్గించడానికి ట్రైకోడెర్మా విరిడితో పాటు సూడోమోనాస్ ఫ్లోర్‌సెన్స్ విత్తనాలకు కలిపి శుద్ధి చేయాలి. రసం పీల్చే పురుగులు, పచ్చ పురుగులు, తామర పు రుగులు, పేను బంక వ్యాప్తిని తగ్గించడానికి ఇమిడాక్లోప్రైడ్ విత్తనాలకు కలపాలి.
4. బెండ: బెండలో రంసం పీల్చే పురుగులను తగ్గించడానికి ఇమిడాక్లోప్రైడ్, నులి పురుగులను తట్టుకోవడానికి పెసిలోమైసెస్ లిలాసినస్, సూడోమోనాస్ ఫ్లోరో సెన్స్ విత్తనాలకు కలిపి శుద్ధి చేయాలి.
5. టమాట: శిలీంధ్ర వ్యాధి, ఆకుముడుత, కాండం కుళ్లు, ఎండు తెగులు తట్టుకోవడానికి ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, ఫర్టిసిల్లియం క్లామిడోస్పోరియం విత్తనాలకు కలపాలి.
విత్తనపూత
విత్తనానికి రసాయన పురుగుమందులు అంటి ఉండడానికి ఒక ప్రత్యేక బైండర్‌ని పురుగుమందుతో కలిపి ఉపయోగించాలి. ఈ పద్దతిని ఎక్కువగా విత్తన పరిశ్రమలలో ఉపయోగిస్తారు.






