15 July, 2026 | 12:18 AM

చెన్నై x హైదరాబాద్

28-04-2024 12:17 AM

చెన్నై: ఐపీఎల్ 17వ సీజన్‌లో ఆదివారం రాత్రి జరగనున్న రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నా యి. చెన్నై వేదికగా  ఈ మ్యాచ్ జరగనుంది. చెన్నై ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. హైదరాబాద్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. సీజన్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న హైదరాబాద్‌కు గత మ్యాచ్‌లో బెంగళూరు బ్రేక్ వేసింది. అయితే వేదిక ఏదైనా చెలరేగడమే లక్ష్యంగా పెట్టుకున్న హైదరాబాద్.. చెన్నైకి వారి సొంతగడ్డపై ఝలక్ ఇవ్వాలని చూస్తోంది. మరోవైపు లక్నోతో జరిగిన గత మ్యాచ్‌లో పరాజయం పాలైన చెన్నై హైదరాబాద్‌పై విజయంతో మళ్లీ విజయాల ట్రాక్ ఎక్కాలని భావిస్తోంది.

చెన్నై బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ రుతురాజ్, శివమ్ దూబేలు మంచి ఫామ్ కనబరుస్తుండగా.. రహానే, మిచెల్ విఫలం కావడం కలవరపెడుతోంది. ఇక జడేజా ఆల్‌రౌండర్‌గా తన పాత్రను సమర్థంగా నిర్వహిస్తుండగా.. ధోని ఫినిషర్‌గా వస్తూ అభిమానులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకొని రాణిస్తున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో దీపక్ చహర్, ముస్తాఫిజుర్, పతిరానా, తుషార్ దేశ్‌పాండేలు రాణిస్తుండగా.. ఆల్‌రౌండర్లు జడేజా తమ స్పిన్ అస్త్రంతో ప్రత్యర్థులను పరుగులు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇక హైదరాబాద్ బ్యాటింగ్ విషయానికొస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్, క్లాసెన్, మార్కరమ్, నితీశ్ కుమార్, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్‌లతో బ్యాటింగ్ విభాగం శత్రుదుర్భేద్యంగా కనిపిస్తోంది. బెంగళూరుతో మ్యాచ్‌లో విఫలమైన హెడ్, క్లాసెన్, మార్కరమ్‌లు ఈ మ్యాచ్‌లో చెలరేగితే చెన్నైకి కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. పాట్ కమిన్స్ జట్టు బౌలింగ్‌ను నడిపిస్తుండగా.. ఉనాద్కట్, భువనేశ్వర్, నటరాజన్ త్రయం తమ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇక మయాంక్ మార్కండే తన స్పిన్ అస్త్రంతో వికెట్లు పడగొడతున్నాడు. దీంతో ఇరుజట్ల మధ్య మ్యాచ్ టప్‌ఫైట్ జరిగే అవకాశముంది.