14 July, 2026 | 9:37 PM

బడి బయట 16,683 మంది పిల్లలు!

09-06-2024 02:14 AM

లెక్కతేల్చిన పాఠశాల విద్యాశాఖ

జనవరిలో సర్వే ద్వారా గుర్తింపు

ఈ ఏడు స్కూళ్లలో చేర్పించేందుకు చర్యలు

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో బడికి వెళ్లే వయసు ఉండి, పాఠశాలకు వెళ్లని చిన్నారులు ౧౬,౬౮౩ మంది ఉన్నారని పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యాశాఖ జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. 16,683 మంది బాలబాలికలు బడికి వెళ్లటం లేదని అధికారులు లెక్క తేల్చారు. వీరిని ఈ విద్యా సంవత్సరం సమీపంలోని పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు.

ఏటా డిసెంబర్ నుంచి జనవరి నెలల్లో బడి ఈడు పిల్లలు బడికి దూరంగా ఎంత మంది ఉన్నారనే దానిపై పాఠశాల విద్యాశాఖ సర్వేను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా సర్వేను నిర్వహించి పిల్లలను గుర్తించింది. అయితే అధికారులు గర్తించిన ఈ సంఖ్య కంటే ఇంకా చాలా ఎక్కువ మందే బడికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు విభాగాలుగా గుర్తింపు

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో బడి బయట ఉన్న పిల్లలను అధికారులు గుర్తించారు. చిన్నారులను ఎలిమెంటరీ లెవెల్ (1 నుంచి 8 తరగతి వరకు), సెకండరీ లెవెల్ (9, 10 తరగతులు)గా వర్గీకరించారు. ఎలిమెంటరీ లెవెల్లో 33 జిల్లాల్లో మొత్తం 11,405 మంది పిల్లలు, సెకండరీ లెవెల్లో 5,278 మంది ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా వీరు మొత్తం 16,683 మంది ఉన్నట్లు లెక్కలు తీశారు. అయితే వీరిలో కొందరు బడి ముఖం అసలే చూడని వారుంటే మరికొందరు మధ్యలోనే చదువును మానేసిన డ్రాపౌట్స్ ఉన్నారు.

గ్రామాలు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, పని ప్రదేశాలు, దుకాణాలు, హోటళ్ల వద్ద సర్వే చేపట్టి బడికి దూరంగా ఉంటున్నవారిని గుర్తించినట్లు తెలిసింది. వీరంతా తిరిగి బడిబాట పట్టేలా విద్యాశాఖ ఏటా సర్వే నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వలసవచ్చిన కుటుంబాలకు చెందిన పిల్లలకు సంబంధించిన జాబితాను కూడా రూపొందించినట్లు తెలిసింది. ఈ తరహా కార్మికులకు సంబంధించిన పిల్లల చదువు కోసం పని ప్రదేశంలోనే ఆయా పరిశ్రమల యాజమాన్యాల సహకారంతో తగతులను ఏర్పాటు చేసి విద్యనందిస్తారు.