14 July, 2026 | 9:09 PM

ఆదిబట్ల జనప్రియ శిఖర భూముల్లో సర్వే

09-06-2024 02:15 AM
  • ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు స్థానికుల ఆరోపణ

సర్వే నిర్వహించిన రెవెన్యూ యంత్రాంగం

కబ్జా నిజమని తేలితే చర్యలు తీసుకుంటామన్న అధికారులు

ఇబ్రహీంపట్నం, జూన్ 8 :  హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో భూముల రేట్లు అమాంతం పెరగడంతో కబ్జాదారుల కన్ను పడింది. ఐటీ కంపెనీలు, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటుతో ఇక్కడి భూముల రేట్లు ఆమాంతం పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న సర్వే నెంబర్ 231, 232, 233, 234లో 7 ఎకరాల 10 గుంటల భూమిలో జనప్రియ శిఖర అపార్ట్‌మెంట్స్ నిర్మిస్తున్నారు. అయితే ఈ నిర్మాణానికి ఆనుకుని ఉన్న సర్వే 255లో గల ప్రభుత్వ భూమి, నాలా సంబంధించిన దాదాపు 20 గుంటల భూమి కబ్జాకు గురైందని స్థానికులు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో, రెవెన్యూ యంత్రాంగం శుక్రవారం సర్వే నిర్వహించింది.

అయితే, సర్వే సమయంలో ఇరిగేషన్ శాఖ అధికారులు లేకపోవడంతో సమన్వయ లోపం కారణంగా వాయిదా పడింది. ఒక పక్క సీఎం రేవంత్‌రెడ్డి చెరువులను, కుంటలను, నాలాలను కాపాడేందుకు ఆయా శాఖల అధికారులు భాద్యతాయుతంగా పనిచేయాలని సూచించినప్పటికీ ఇబ్రహీంపట్నం డివిజన్ ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వేకు హాజరుకాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మండల సర్వేయర్ సాయికృష్ణ మాట్లాడుతూ.. వారం రోజుల్లో మరోమారు సర్వే చేస్తామని, ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు తెలితే ఎలాంటి నోటీసులు లేకుండానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ కృష్ణ, సర్వే అధికారులు పాల్గొన్నారు.