9 August, 2026 | 10:27 AM

చిరంజీవి మాజీ అల్లుడు మృతి

20-06-2024 02:04 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (విజయక్రాంతి): మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ (39) అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. ఊపిరితిత్తులు చెడిపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. శ్రీజ, శిరీష్ భరద్వాజ్ 2007లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శిరీష్ కోసం శ్రీజ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం అప్పుడు సంచలనం సృష్టించింది.

శ్రీజ, శిరీష్ దంపతులకు ఓ కూతురు కూడా ఉంది. కానీ వీరి వైవాహిక బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. తనను వేధిస్తున్నాడని శ్రీజ 2012లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి మధ్య మనస్పర్థలు పెరగడంతో 2014లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2016లో ప్రముఖ వ్యాపారవేత్త కల్యాణ్‌దేవ్‌తో శ్రీజకు వివాహమైంది. 2019లో శిరీష్ భరద్వాజ్ నగరానికి చెందిన డాక్టర్ విహనను వివాహం చేసుకున్నారు.

  • శ్రీరెడ్డి పోస్ట్‌పై నెటిజన్ల విమర్శలు

శిరీష్ మృతిపై సినీనటి శ్రీరెడ్డి స్పందిస్తూ శ్రీజతో శిరీష్ భరద్వాజ్ ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఇకలేరు. ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందిరా శిరీష్. అందరూ నిన్ను మోసం చేశారు’ అని రాయడం సంచలనంగా మారింది. శ్రీజ మోసం చేసిందని శ్రీరెడ్డి చేసిన పోస్ట్‌పై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.  ఇద్దరు ఇష్టంతో విడిపోయాక అలా అనడం సమంజసం కాదంటున్నారు.