-సామాజిక సమస్యలపై పౌరులూ పోరాడాలి
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఘాటి’. విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటించిన ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానున్న నేపథ్యంలో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
-నా ప్రతి సినిమా ఒక అడ్వెంచర్ లాంటిదే. ‘ఘాటి’ విషయానికొస్తే.. ఆంధ్రఒడిశా సరిహద్దుల్లో శీలావతి రకం గంజాయి పెరుగుతుంది. దానికోసం ఒక వ్యవస్థ పని చేస్తుంటుంది. అక్కడి కూలీలను ఘాటీలు అని పిలుస్తారు. వాళ్ల నేపథ్యం గురించి రచయిత డాక్టర్ చింత కింద శ్రీనివాసరావు 30 పేజీల కథగా రాశారు. నాకు చాలా నచ్చింది. దాన్ని డెవలప్ చేయడం మొదలుపెట్టాను. లొకేషన్ కోసం తూర్పు కనుమలకు వెళ్లాను. ఒక కొత్త ప్రపంచాన్ని, సంస్కృతిని, జీవనశైలిని చూపించే ఆస్కారం ఉంటుందని ‘ఘాటి’ని మొదలుపెట్టాం.
-ఈ కథ -నాయికీ ప్రధానంగానే పుట్టింది. ‘వేదం’ తర్వాత స్వీటీ (అనుష్క)తో మరో సినిమా చేయాలని ఆలోచన ఎప్పట్నుం చో ఉండేది. ఇందులోని శీలావతి క్యారెక్టర్‌కు అనుష్క గ్రేస్, యాటిట్యూడ్, సూపర్ స్టార్ డమ్‌కి పర్ఫెక్టస్ యాప్ట్.
-ఘాటి కథ పూర్తిగా ఫిక్షనల్. గంజాయి ఒక సోషల్ ఇష్యూ. ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ, గంజాయి.. ఆ ప్రయత్నాలన్నీ దాటుకొని సమాజంలోకి వస్తోంది. సర్వైవల్ కోసం చేసినా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఐడెంటిటీ, సర్వైవల్ థీమ్స్‌తో వస్తున్న సినిమా ఇది. -సామాజిక సమస్యలపై ప్రభుత్వాలే కాకుండా పౌరులంతా పోరాడాలి. ఈ సినిమా ఒక సమస్య నిర్మూలనకు ఊతమిస్తుంది కానీ గ్లోరీఫై చేసేలా ఉండదు.
-ఈ కథను చాలా అందంగా, సినిమాటిక్‌గా అన్ని జాగ్రత్తలు తీసుకుని చెప్పాం. దీన్ని యాక్షన్‌తో చెబితేనే ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే పాత్రలు, భావోద్వేగాలు చాలా తీవ్రమైనవి. అవన్నీ యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపిస్తాయి. ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్, లొకేషన్స్ పరంగా లార్జెస్ట్ కాన్వాస్ ఉన్న సినిమా ఇది.
--సాయిమాధవ్ ఒక విస్తృతమైన విషయాన్ని చాలా అందంగా రాసేస్తారు. ‘ఘాటి’లో మాటలు కూడా ప్రేక్షకుల మనసును సూటిగా తాకుతాయి. -ఇందులో మూడు పాటలు రాశా. ‘స్వేచ్ఛ పథకాలన్నీ ఒకప్పటి బందీలే.. సందేశాలన్నీ తప్పుల నుంచి నేర్చిన పాఠాలే..’ అనే పల్లవి రాశాను. అది సాయి మాధవ్‌కి నచ్చి, డైలాగ్‌గా మార్చారు. సిరివెన్నెల దగ్గర శిష్యరికం చేసిన ఫలితంగా ఆయన ఆశీర్వాదం వల్ల అలా కలం విదిలించా (నవ్వుతూ).






