2 April, 2026 | 3:19 AM

నాలుగు లేబర్ కోడ్‌ల అమలుకు సీఐటీయూ నిరసన

02-04-2026 12:29 AM

మేడ్చల్ అర్బన్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): నాలుగు లేబర్ కోడులను బుధవారం నుంచి అమలు చేస్తున్నందున సిఐటియు ఆధ్వర్యంలో మేడ్చల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సి ఐ టి యు దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించి నిరసనలు తెలిపాలని పిలుపునివ్వగా మేడ్చల్ మండల కమిటీ ఆధ్వర్యంలో డిపో వద్ద, డబిల్ పూర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు.

నాలుగు లేబర్ కోడ్ లు కార్మికుల హక్కులు కాలరాసే విధంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం 2 9 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడులు తెచ్చిందన్నారు. లేబర్ కోడులను నిరసిస్తూ కార్మికులు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ అమలు చేయడం కార్మిక వ్యతిరేక విధానాలకు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎం నరేష్, డి నరసింగరావు, యాదగిరి, కావేరి, దేవమ్మ, జి నాగరాణి, నిత్యానాథ్, తస్లీమ్ బేగం, సమీనా, లక్ష్మీ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

తాండూరులో..

తాండూర్,  ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : వికారాబాద్ జిల్లా తాండూరులో సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ అమలును నిరసిస్తూ సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిరసనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక హక్కులను హరించే 4 లేబర్  కోడ్స్ రద్దు చేయాలన్నారు. విద్యుత్ సవరణ బిల్లు-2022ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్  చేశారు . లేదంటే  రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన  కార్యక్రమాలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది గ్రామపంచాయతీ కార్మికులు, సిఐటియు నాయకులు  పాల్గొన్నారు.