బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓటు చోరీకి పాల్పడుతున్నాయి
ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
కోదాడ, జాన్ 14 : కేంద్రంలో భాజపా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఓట్ల చోరీకి పాల్పడుతున్నట్లు బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లాలోని కోదాడ పట్టణంలో ఓటర్ జాబితా పరిశీలన, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సులో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి కార్యకర్త ఓట్ల మ్యాపింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికార పక్షం సర్ ద్వారా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటర్లను తొలగించే ప్రక్రియ చేయవచ్చని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది ఓటు హక్కుకు దూరమైనట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆర్‌ఆర్బి, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ పరీక్ష తేదీలు ఒకే సమయంలో ఉండటం కారణంగా అభ్యర్థులు నష్టపోతున్నట్లు తెలిపారు. టెట్ పరీక్షను రెండు వారాలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను భ్రస్టు పట్టించినట్లు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి గ్రామం, ప్రతి వార్డు స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి పార్టీ తరఫున పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ , మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహా రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






