అవినీతికి అడ్డాగా సివిల్ సప్లయ్
సూర్యాపేట, మే 25 (విజయక్రాంతి): అవినీతికి సివిల్ సప్లయ్ శాఖ అడ్డాగా మారిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. కాళే శ్వరం ప్రాజెక్టు తర్వాత రాష్ట్రంలో జరిగిన అతి పెద్ద అవినీతి స్కామ్ ధాన్యం కొనుగోళ్లే నని ధ్వజమెత్తారు. రైసుమిల్లుల నుంచి నాయకులకు భారీగా ముడుపులు అందాయని, వాటిపై ప్రభుత్వం విచారణ చేయా లని డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాం నుంచి సివిల్ సప్లయ్ శాఖలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు మధ్యవర్తిత్వం వహించే సివిల్ సప్లయ్ శాఖ దాదాపు రూ.10 వేల కోట్ల నుంచి రూ.11వేల కోట్ల నష్టాల్లో ఎందుకు ఉన్నదని ప్రశ్నించారు.
ఆ శాఖకు రూ.50 వేల కోట్ల అప్పులు ఎందుకయ్యాయని నిలదీశారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం రూ. వేల కోట్లు ఎలా సంపాదించిదో.. అదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం సైతం సంపాదించి ఢిల్లీకి పంపుతున్నదని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. గతంలో జరిగిన ధాన్యం కొనుగోలు అవకతవకలు బయటకు తీసి బాధ్యులను అరెస్ట్ చేస్తామన్నాని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దీనిపై ఎందుకు విచారణ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై తనకు నమ్మకం ఉన్నదని.. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు అవకతవకలపై విచారణ చేయించాలని కోరారు. రైస్ మిల్లుల నుంచి నాయకులకు అందిన ముడుపులపై ఇతర శాఖల సహకారంతో సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని విజ్ఞప్తిచేశారు.
గతంలో ఆంధ్రప్రదేశ్‌తో కుమ్మక్కయిన కేసీఆర్ కృష్ణా జలాల కేటాయింపు విషయంలో నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. జిల్లాకు 590 టీఎంసీల నీరు రావాల్సి ఉంటే కేసీఆర్ 290 టీఎంసీలకు అంగీకరించారని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిన పార్టీ బీఆర్‌ఎస్ అయితే అదే పంథాను కొనసాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. రైతులకు ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో రాజ్యాగవిరుద్ధంగా ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో హిందువులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. మేధావులు ఆలోచించి ఓటు వేయా లని కోరారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి కొట్లాడే గుణం ఉందని, 40 సంవత్సరాలగా పార్టీ కోసం పని చేస్తూ, ప్రజసమస్యలపై పోరాడే వ్యక్తి అని చెప్పారు. ప్రతి పట్టాభద్రు లు తమ ఓటు హక్కు కచ్చితంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.






