మక్క రైతు విలవిల
కామారెడ్డి, మే 26 (విజయక్రాంతి) : ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు అమ్ముకుందామంటే ప్రభుత్వం మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో దళారుల దగ్గరికి వెళ్లాల్సివస్తుందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 50 వేల ఎకరాల్లో రైతులు మక్కజొన్న పండించినట్టు వ్యవసాయాధికారులు చెప్తున్నారు. జిల్లాలో 2000 మెట్రిక్ టన్నుల మక్కలు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ప్రభుత్వం ఏర్పాటుచేసే కొనుగోలు కేంద్రాలలో మొక్కజొన్నలను విక్రయిస్తే దోపిడీ జరిగేది కాదని రైతులు అంటున్నారు. ప్రభుత్వం క్వింటాల్ కు రూ. 1950 ధర నిర్ణయించిందని, ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.2100 మాత్ర మే చెల్లిస్తున్నారని మార్క్‌ఫెడ్ డీఎం రమ్య తెలిపారు. ప్రైవేట్ వ్యాపారులు ఎక్కువ ధరకు మక్కలు కొనుగోలు చేస్తున్నారని, అందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని తెలిపారు. రైతులు మాత్రం పండించిన మక్కజొన్న పంట వద్దకే ప్రైవేట్ వ్యాపారులు వచ్చి క్వింటాల్‌కు రూ. 2100 కు కొనుగోలు చేస్తున్న తేమ పేరుతో 40 కిలోల సంచికి 42 కిలోల చొప్పున కాంటా పెట్టుకుంటున్నారని ఆరోపించారు.
క్వింటాల్‌కు 4 కిలోలు తరుగు తీస్తున్నారని వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలలో ఇంత తరుగు ఉండేది కాదని చెప్తున్నారు. క్వింటాల్‌కు రెండు కిలోలు మాత్రమే తరుగు తీసేవారని పేర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే జిల్లాలో మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని గాంధారి, లింగంపేట్, తాడ్వాయి, సదాశివనగర్, రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, బీబీపేట్, దోమకొండ, భిక్కనూర్, రాజంపేట్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, పిట్లం, బీర్కూర్, పెద్దకొడప్‌గల్, చిన్నకొడప్‌గల్, బిచ్కుంద మండలాలలో మక్కజొన్న అధికంగా పండించారు.
రెండు, మూడు మండలాలకు కలిపి ఒకచోట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని రైతులు అంటున్నారు. గతంలో ప్రభుత్వం మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మక్కలను కొనుగోలు చేసేదని, ప్రస్తుతం కొనుగోలుకేంద్రాల ఊసే ఎత్తట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేరుకే రైతు ప్రభుత్వం..
రైతు ప్రభుత్వం అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మక్కొజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నదని రైతులు మండి పడుతున్నారు. దీంతో మక్కజొన్న పండించిన రైతులు దళారులు చెప్పినట్లుగానే అమ్ముకొవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అమ్ముకుందామంటే దళారుల వద్దకు వెళ్లి విక్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు.
గిరిజనులు ఎక్కువగా మక్కజొన్న పంటలను పండించారని వారి ఇంటి వద్ద కల్లాలను ఏర్పాటు చేసుకొని, నిలువ ఉంచుకుంటున్నారు. దళారులు వచ్చి రైతులకు అధిక ధర ఆశ చూపి, క్వింటాల్‌కు ఆరు కిలోల వరకు తరుగు పేరుతో ఎక్కువ దండుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దళారులు చెప్పినట్టే వినాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. జిల్లాలో మక్కజొన్నలు పెద్ద మొత్తంలో రైతుల వద్దనే ఉన్నాయని, మార్క్‌ఫెడ్ అధికారులు వెంటనే కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేసి, రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
మక్కజొన్నలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఎక్కువ ధర వస్తుందని చెప్తున్నారు కానీ, దళారులు చెప్పినట్లుగానే అమ్ముకోవాల్సి వస్తుంది. 40 కిలోల బస్తాకు నాలుగు కిలోల వరకు తరుగు పేరుతో అధికంగా కాంటా వేస్తున్నారు. రైతులను మోసం చేస్తున్నారు.






