15 June, 2026 | 3:19 AM

విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి

15-06-2026 02:09 AM
  1. జవాబుదారీతనం కోసం యువత ముందుకు రావాలి
  2. విద్యావేత్త, పర్యావరణ వేత్త సోనం వాంగ్‌చుక్
  3. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
  4. సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి విజేత దహియా
  5. ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద సీజేపీ సమావేశం
  6. జూన్ 20న ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద మహాధర్నాకు పిలుపు

ముషీరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): దేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని విద్యావేత్త, పర్యావరణవేత్త సోనం వాంగ్‌చుక్ అన్నారు. ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దులు, యువత భవిష్యత్తుతో జరుగుతున్న నిర్లక్ష్యం ఆందోళనకరమని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఆదివారం నిర్వహించిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సమావేశానికి సోనం వాంగ్‌చుక్, సీజేపీ ప్రతినిధి విజేత దాహియా హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనం వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. భయరహిత, ద్వేషరహిత సమాజ నిర్మాణం ద్వారానే దేశం నిజమైన అభివృద్ధి సాధించగలదని చెప్పారు. ప్రకృతి, నీటి వనరులు, చెట్ల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. దేశంలో జవాబుదారీతనం కోసం జరుగుతున్న ఉద్యమానికి తన మద్దతు ఉంటుందని వెల్లడించారు.

సభలో కొందరు యువత తనను విద్యాశాఖ మంత్రిగా చూడాలని అకుంటున్నామని కోరగా, తనకు ఎలాంటి పదవులపై ఆశలు లేవని, యువత ముందుండి దేశాన్ని నడిపించాలని, తాను వారి వెనుక నిలబడి పూర్తి మద్దతు అందిస్తానని స్పష్టం చేశారు. సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి విజేత దహియా మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అవసరమన్నారు. మతం, కులం, ద్వేష రాజకీయాల కంటే విద్య, ఉపాధి, యువత భవిష్యత్తు వంటి అంశాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు.

తరచూ జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దులకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రుచిత్ ఆశా కమల్ సీజేపీ ప్రతిపాదించిన ఐదు అంశాల పరీక్షల మేనిఫెస్టోను వివరించారు. ప్రశ్నాపత్రాల లీకులతో నష్టపోయిన విద్యార్థులకు పరిహారం, పరీక్షలు రద్దయిన 72 గంటల్లోపు రీ-ఎగ్జామ్ నిర్వహణ, మాన్యువల్ మూల్యాంకనం, వయోపరిమితి స్వయంచాలక పొడిగింపు, కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు స్వతంత్ర సాంకేతిక తనిఖీలు వంటి డిమాండ్లను వెల్లడించారు.

జూన్ 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత ఢిల్లీకి చేరుకుని లక్షలాది మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయాలని కోరారు. కార్యక్రమానికి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, అకునూరి మురళి, రిటైర్డ్ ఐపీఎస్ ఎంవి వెంకట్ రెడ్డి, అశోక్, ప్రశ్న రావణ్, తులసి చందు, తెలంగాణ విఠల్ తదితరులు హాజరై యువతకు సందేశమిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు. దాదాపు 60 మంది వాలంటీర్లు కార్యక్రమ నిర్వహణలో పాల్గొని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. కార్యక్రమం ముగింపులో నిర్వాహకుడు విజయ్ మల్లంగి భారత రాజ్యాంగ ప్రవేశికను సభికులతో సామూహికంగా పఠింపజేశారు. అనంతరం అందరూ కలిసి జాతీయ గీతం ’జనగణమన’ ఆలపించడంతో సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సీజేపీ ఉద్యమానికి మద్దతు తెలిపే వారు ఫోన్: 7277773355 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రజలు కలిపి సుమారు 5వేల మంది పాల్గొన్నారు.