17 June, 2026 | 2:10 AM

మైసంపేటలో ఉద్రిక్తత

17-06-2026 01:02 AM

సాగు భూముల కోసం గిరిజనుల ఆందోళన

పునరావాస గ్రామంలో భూమి కొలతలు అడ్డగింత

గిరిజనులకు, అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ 

20 మంది అరెస్ట్

నిర్మల్/ఖానాపూర్, జూన్ 16 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేటలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కడెం మండలంలో ఏర్పాటైన కవ్వాల్ టైగర్ జోన్ అభయారణ్యం పరిధిలో మైసంపేట గ్రామం విలీనం అయింది. కాగా అక్కడి గ్రామ గిరిజనులకు అదే మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ వద్ద పునరావాసం ఏర్పాటు చేశారు.

పునరావాస గ్రామంలో తమకు సాగుభూములు చూపించాలని మైసంపేట వాసులు కొన్ని రోజులుగా అధికారులను కోరుతూ వస్తున్నారు. మంగళవారం అటవీ శాఖ అధికారులు పునరావాస గ్రామంలో భూమి కొలతలు పెట్టి లబ్ధిదారులకు అందించే క్రమంలో స్థానిక గోండుగూడ గిరిజనులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. తమకు సరైన న్యాయం చేశాక మైసంపేట గిరిజనులకు భూములు కేటాయించాలని ఆందోళనకు దిగారు. దీంతో మైసంపేట గిరిజనులు కల్పించుకోవడంతో ఇరు వర్గాల గిరిజన ప్రజల మధ్య వాగ్వాదం జరిగింది.

సరిహద్దులు చూపేందుకు వచ్చిన అధికారులపై గోండుగూడ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. దీంతో అక్కడకు వచ్చిన పోలీస్‌లు ఆందోళన చేస్తున్న మహిళలను అరెస్టు చేశారు. 20 మంది గిరిజనులను అదుపులోకి తీసుకుని జన్నారం మండలం ఇంధన్‌పల్లి అటవీ కార్యాలయానికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. రెండు గ్రామాల మధ్య ఉన్న సరిహద్దు భూ భాగం విషయంలో ఇరు గ్రామాల గిరిజనులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.